తెలంగాణ ప్రభుత్వం సింగరేణి కార్మికుల కోసం కోటి రూపాయల ప్రమాద బీమా పథకం ప్రారంభించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సచివాలయంలో ఈ పథకాన్ని ప్రారంభించారు. బీమా పథకం ప్రారంభోత్సవంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీతక్క, కొండా సురేఖ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సింగరేణి ఎండీ బలరాం మాట్లాడుతూ కార్మికులకు రూ.కోటి ప్రమాద బీమా పథకం గొప్ప పథకం అని కొనియాడారు. ఇప్పటివరకు సైనికులకు మాత్రమే ఈ పథకం ఉందని.. ఇప్పుడు సింగరేణి కార్మికులకు కూడా ఈ పథకం ప్రవేశపెట్టడం సంతోషకరమని హర్షం వ్యక్తం చేశారు. ఔట్ సోర్సింగ్ సిబ్బందికి కూడా రూ.40 లక్షల బీమా పథకం గొప్ప నిర్ణయమని ప్రశంసించారు. మొత్తంగా కార్మికులకు రూ.1.20 కోట్ల పరిహారం అందుతుందని తెలిపారు.
డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. కార్మికులకు రూ.కోటి బీమా పథకం గతంలో ఎప్పుడూ లేదని తెలిపారు. 43 వేల మంది కార్మికులకు రూ.కోటి ప్రమాద బీమా పథకం వర్తిస్తుందని చెప్పారు. కార్మికుల కుటుంబాలను కాపాడుకునేందుకే భారీ బీమా పథకం ప్రారంభించామని.. కార్మికుల సంక్షేమానికి ఈ ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు. ఔట్‌సోర్సింగ్ సిబ్బందికి భారీ బీమా పథకం దేశంలో మరెక్కడా లేదని పేర్కొన్నారు.