తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగుల సాధారణ బదిలీలపై నెలకొన్న సందేహాలను ఆర్థిక శాఖ నివృత్తి చేసింది. ఒకేచోట నాలుగేళ్ల నుంచి పనిచేసిన వారందరికీ బదిలీ ఉంటుందని స్పష్టం చేసింది. భార్యాభర్తలున్నా తప్పనిసరిగా ట్రాన్స్ఫర్ చేయాల్సి ఉంటుందని తేల్చిచెప్పింది. అయితే కొత్త ప్రాంతాల్లో దగ్గరగా ఉండేలా వారికి పోస్టింగులు ఇస్తామని పేర్కొంది.
ప్రస్తుతం నాలుగేళ్ల సర్వీసు పూర్తిచేసిన భార్యాభర్తలుంటే వారిని బదిలీ చేయాలని పేర్కొంది. స్పౌజ్ కేస్ నిబంధన కింద చాలామంది ఉద్యోగ దంపతుల్లో ఒకరు నగరంలో, మరొకరు గ్రామీణ ప్రాంతాల్లో ఉండగా తమ జీవిత భాగస్వామి నగరంలో పనిచేస్తున్నందున తమను అక్కడికే బదిలీ చేయాలని గట్టిగా అడుగుతున్నారు. ఇలా అడిగేవారిని కచ్చితంగా నగరానికి బదిలీ చేయాల్సిన అవసరం లేదని ఆర్థికశాఖ స్పష్టతనిచ్చింది. నగరంలో ఉన్నవారినే గ్రామీణ ప్రాంతానికి మార్చవచ్చని నిబంధనలు చెపుతున్నాయని ఆర్థికశాఖ తేటతెల్లం చేసింది. నిబంధనల ప్రకారం వేర్వేరు శాఖల్లో పనిచేస్తున్నా.. ఇద్దరికీ నగరంలో నాలుగేళ్ల సర్వీసు పూర్తయితే కచ్చితంగా ఇతర ప్రాంతాలకు బదిలీ చేయాల్సిందేనని నిబంధనలు చెబుతున్నాయి.