వరంగల్ – ఖమ్మం -నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి ఉప ఎన్నిక పోలింగ్ కొనసాగుతోంది. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన ఓటింగ్ సాయంత్రం 4 గంటల వరకు కొనసాగనుంది. మొత్తం 12 జిల్లాల పరిధిలోని 34 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ఈ ఎన్నిక జరుగుతోంది. 52 మంది అభ్యర్థులు ఈ ఉపఎన్నిక బరిలో నిలిచారు. జూన్ 5న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు.
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పలువురు రాజకీయ ప్రముఖులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. సూర్యాపేటలోని జూనియర్ కళాశాలలో బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి ఓటు వేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండల పరిషత్ ఉన్నత పాఠశాలలో కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న , ఆయన సతీమణి మమత ఓటు హక్కును వినియోగించుకున్నారు. హనుమకొండ జిల్లా కేంద్రంలోని పింగళి ప్రభుత్వ మహిళా కళాశాలలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డి ఓటేశారు. నల్గొండ డైట్ స్కూల్లో హరిచందన ఓటేశారు.