కాళేశ్వరం విచారణలో జోక్యం చేసుకోం : హైకోర్టు

-

కాళేశ్వరం ప్రాజెక్టు విచారణలో జోక్యం చేసుకోలేమని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ ప్రాజెక్టు నిర్మాణంలో లోపాలు, అవినీతి ఆరోపణలపై నేషనల్‌ డ్యాం సేఫ్టీ అథారిటీ, విజిలెన్స్‌ విచారణతోపాటు సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ పి.సి.ఘోష్‌ నేతృత్వంలోనూ న్యాయ విచారణ జరుగుతోందని, ఈ దశలో తాము జోక్యం చేసుకోలేమని పేర్కొంది. కాళేశ్వరం నిర్మాణంలో అవినీతి ఆరోపణలు, మేడిగడ్డ కుంగుబాటు తదితరాలపై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కె.ఎ.పాల్, న్యాయవాది బి.రామ్మోహన్‌రెడ్డి, ప్రొఫెసర్‌ కోదండరామరెడ్డి, న్యాయవాది ముధుగంటి విశ్వనాథరెడ్డి, బక్క జడ్సన్‌లు వేర్వేరుగా దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యాలపై హైకోర్టు గురువారం రోజున విచారణ చేపట్టటింది.

‘కాళేశ్వరం ప్రాజెక్టు వ్యవహారాలపై విచారణ పూర్తికాకపోవడంతో జస్టిస్‌ పి.సి.ఘోష్‌ కమిషన్‌ గడువు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేశామని రాష్ట్ర ప్రభుత్వం తరఫున అదనపు అడ్వొకేట్‌ జనరల్‌ కోర్టుకు తెలపగా.. తన పిటిషన్‌ ఈ కమిషన్‌ ఏర్పాటుకాక ముందు వ్యవహారాలపై దాఖలు చేశానని, అవినీతి వ్యవహారాలపై సీబీఐతో దర్యాప్తు జరిపించాలని కోరానని, సింగిల్‌ జడ్జి వద్ద ఈ పిటిషన్‌లో సీబీఐ కూడా కౌంటరు దాఖలు చేసిందని పిటిషనర్‌ రామ్మోహన్‌రెడ్డి తెలిపారు. ప్రభుత్వాన్ని ప్రతివాదిగా చేయడానికి అనుమతించాలని న్యాయవాది రామ్మోహన్‌రెడ్డి కోరగా అనుమతిస్తూ ధర్మాసనం విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version