బ్యాలెట్ పేపర్‌లో మార్పులపై కొండా విశ్వేశ్వర్ రెడ్డి వినతి పత్రాన్ని పరిశీలించిన హైకోర్టు

-

బ్యాలెట్ పేపర్‌లో మార్పులపై చేవేళ్ల పార్లమెంటరీ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి సమర్పించిన వినతి పత్రంపై హైకోర్టు స్పందించింది. దీన్ని పరిశీలించి వీలైనంత త్వరగా నిర్ణయం తీసుకోవాలంటూ కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది. చేవేళ్ల పార్లమెంటరీ నియోజకవర్గంలో ఒకే పేరుతో ఇద్దరు నామిషన్ వేసినందున.. ఒక్కో పేరు మధ్య కనీసం 10 నెంబర్ల వ్యత్యాసం ఉంచుతూ బ్యాలెట్ పేపర్‌లో మార్పు చేసేలా ఎన్నికల సంఘాన్ని ఆదేశించాలని కొండా విశ్వేశ్వర్‌రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆలోక్ అరాదే, జస్టిస్ జె. అనిల్‌ కుమార్‌లతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది.

పార్లమెంట్ ఎన్నికల్లో చేవెళ్ల నియోజకవర్గం నుంచి పిటిషనర్‌తోపాటు 46 మంది నామినేషన్ దాఖలు చేశారని, పిటిషనర్ పేరు ఉన్న మరో వ్యక్తి కూడా నామినేషన్ దాఖలు చేశారని పిటిషనర్ తరపు న్యాయవాదులు వాదనలు వినిపించారు. జాబితాలో సీరియల్ నెంబరు 2గా పిటిషనర్ పేరు ఉందని, అయిదో పేరుగా కొండా విశ్వేశ్వర్‌రెడ్డి తండ్రి కాంతారెడ్డి అని ఉందన్నారు. పిటిషనర్ ప్రచారానికి వెళుతుంటే 5వ నెంబరు అభ్యర్థా అని అడుగుతున్నారని తెలిపారు. రెండు పేర్లు ఒకేచోట ఉన్నట్లయితే ఓటర్లు అయోమయంలో పడే అవకాశం ఉందని కోర్టుకు వివరించారు.

 

ఎన్నికల సంఘం తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ…. ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లో ఉన్నందున పిటిషనర్ వినతి పత్రాన్ని పరిగణనలోకి తీసుకోలేదన్నారు. ఇరుపక్షాల వాదనలను విన్న ధర్మాసనం బ్యాలెట్ పేపర్‌లో మార్పులు చేయాలంటూ ఎన్నికల సంఘానికి ఈ దశలో ఉత్తర్వులు ఇవ్వలేమని.. అయితే పిటిషనర్ సమర్పించిన వినతి పత్రంపై వీలైనంత త్వరగా నిర్ణయం తీసుకోవాలని ఎన్నికల సంఘానికి సూచిస్తూ పిటిషన్‌పై విచారణను మూసివేసింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version