తెలంగాణలో భానుడి భగభగలతో ప్రజలు విలవిలలాడుతున్నారు. రాష్ట్రంలో చాలాచోట్ల ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలు దాటాయి. మంగళవారం రోజున మిర్యాలగూడలో 45.1 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైనట్లు హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. నల్గొండ జిల్లాలోని వేములపల్లి, దామరచర్ల, అనుముల హాలియా, తిరుమలగిరి(సాగర్), త్రిపురారం, గట్టుప్పల్, నిడమనూరు మండలాల్లోనూ 44 డిగ్రీల ఎండతో ప్రజలు ఉక్కిరిబిక్కిరయ్యారు.
మరోవైపు భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, ఖమ్మం, సూర్యాపేట జిల్లాల్లో 43.7 నుంచి 44.9 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదైనట్లు అధికారులు తెలిపారు. హైదరాబాద్ మహానగర పాలక సంస్థ పరిధిలో 41.3 నుంచి 43 డిగ్రీల వరకు ఎండలున్నాయని చెప్పారు. ఎండ వేడిమికి ప్రజలు అల్లాడిపోతున్నారు. అత్యవసర పనులపై బయటకు వెళ్లిన వారు ఎండ దెబ్బకు కుదేలవుతున్నారు.
పెద్దపల్లి జిల్లా మంథని మండలం విలోచవరంలో లక్ష్మి(55) అనే మహిళ మంగళవారం రోజున ఉపాధి హామీ పనులు చేస్తూ వడదెబ్బకు గురై అక్కడికక్కడే మృతి చెందారు. సూర్యాపేట జిల్లా ఆత్మకూర్(ఎస్) మండలంలోని కోటినాయక్‌తండాకు చెందిన దరావత్ గోల్యా(70), రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ గ్రామీణ మండలం బాలరాజ్‌పల్లిలో నాగుల బాలయ్య(50) అనే రైతు ఎండదెబ్బతో అస్వస్థతకు గురై మరణించారు.