తెలంగాణలో లోక్‌సభ ఎన్నికల అనంతరం స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్‌ఈసీ) రంగం సిద్ధం చేస్తోంది. ఈ ఎన్నికలను బ్యాలెట్ బాక్సులతో నిర్వహించాలని తాజాగా నిర్ణయించింది. ఈ నేపథ్యంలో ఆ దిశగా ఏర్పాట్లు షురూ చేసింది. ఇందులో భాగంగా బ్యాలెట్ బాక్సులకు సంబంధించిన సీళ్లు, చిరునామా ట్యాగ్‌లను వచ్చే నెల 15వ తేదీలోగా ముద్రించాలని పంచాయతీరాజ్ కమిషనర్‌ను ఎస్‌ఈసీ ఆదేశించింది.
రాష్ట్రంలో సర్పంచుల పదవీ కాలం ఫిబ్రవరి ఒకటో తేదీతో ముగిసిన విషయం తెలిసిందే. మండల, జిల్లా పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గ (ఎంపీటీసీ, జడ్పీటీసీ) సభ్యుల పదవీ కాలం జులై 3వ తేదీన ముగియనుంది. ఇప్పటికే స్థానిక సంస్థల ఎన్నికల కోసం ఎస్‌ఈసీ కసరత్తు చేపట్టింది. గ్రామ పంచాయతీల ఎన్నికలు వాయిదా పడడంతో ప్రత్యేకాధికారుల పాలన కొనసాగుతోంది. లోక్‌సభ ఎన్నికల అనంతరం స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం సంకేతాలు ఇచ్చింది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల సంఘం చర్యలను వేగవంతం చేసింది.