తెలంగాణ ఇంటర్ అడ్వాన్స్‌డ్, సప్లిమెంటరీ పరీక్షల తేదీలు ఖరారయ్యాయి. జూన్ 4 నుంచి కాకుండా 12వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. ఉదయం 9-12 గంటల వరకు ప్రథమ, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి 5.30 గంటల వరకు ద్వితీయ సంవత్సరం పరీక్షలు ఉంటాయని ఇంటర్ బోర్డు తెలిపింది.
అయితే జూన్ 4న జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్ష, ఆ తర్వాత ఇతర పోటీ పరీక్షలు ఉండటంతో వారం రోజులపాటు వాయిదా వేసినట్లు చెబుతున్నారు. పరీక్షలు 12న ప్రారంభమై జూన్ 20తో ముగుస్తాయి. అనుత్తీర్ణులు సప్లిమెంటరీ పరీక్షలకు హాజరయ్యేందుకు దరఖాస్తు గడువు ఈనెల 19 వరకు ఉంది.
గతంలో ప్రయోగ పరీక్షలకు హాజరుకాని ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు జూన్ 5 నుంచి 9వ తేదీ వరకు నిర్వహిస్తారు. ఉదయం 9-12 గంటలు, మధ్యాహ్నం 2-5 గంటల వరకు రోజుకు రెండు విడతలుగా ఉంటాయి. ప్రథమ సంవత్సరంలో నైతికత, మానవీయ విలువల పరీక్షలు రాయని విద్యార్థులకు జూన్ 21న, పర్యావరణ విద్య పరీక్షను 22న నిర్వహిస్తారు.