రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె.తారకరామారావు ప్రస్తుతం యూకే పర్యటనలో ఉన్నారు. ఈ క్రమంలోనే రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నారు. అక్కడ పలు అంతర్జాతీయ సంస్థలను కలుస్తూ తెలంగాణ గురించి వివరిస్తున్నారు. భారత్‌లో సహజవనరులతో పాటు మానవవనరులు అపారంగా ఉన్నాయని గణాంకాలతో సహా కేటీఆర్ వెల్లడించారు. అన్నింటిని సరిగ్గా వినియోగించుకుంటే చైనా 30 ఏళ్లలో సాధించిన విజయాలను.. భారత్ 20 సంవత్సరాలలోపే సాధించగలదని విశ్వాసం వ్యక్తం చేశారు.
ఉపాధి, వ్యవస్థాపకతలో యువతకు అనేక అవకాశాలను అందించాలని కేటీఆర్ పేర్కొన్నారు. భారతదేశంలో విజయవంతమైన స్టార్టప్ రాష్ట్రంగా తెలంగాణ వెలుగొందుతోందని కేటీఆర్ చెప్పారు. లండన్‌లో జరిగిన ఐడియాస్ ఫర్ ఇండియా సదస్సులో పాల్గొన్న కేటీఆర్.. తెలంగాణ రాష్ట్ర విధానాలు, అభివృద్ధి ప్రస్థానాన్ని వివరించారు. వ్యవసాయం, అనుబంధ రంగాల్లో ఐదు విప్లవాలతో రాష్ట్రం తొమ్మిదేళ్లలో అద్భుతమైన ప్రగతి సాధించిందని సోదాహరణంగా పేర్కొన్నారు.
రసాయన పరిశ్రమ క్రోడా ఇంటర్నేషనల్‌తోనూ మంత్రి కేటీఆర్ సమావేశమయ్యారు.జీనోమ్ వ్యాలీలో గ్లోబల్ టెక్నికల్ కేంద్రం ఏర్పాటు చేస్తున్నట్లు ఆ సంస్థ ప్రకటించింది. మరోవైపు స్పోర్ట్స్ డ్రైవ్ స్ట్రీమింగ్ దిగ్గజం డాన్జ్ హైదరాబాద్లో ప్రొడక్ట్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటుకు ముందుకొచ్చింది. ఇక్కడ ఏర్పాటు చేసే ఆ కేంద్రంతో 1,000 మందికి ఉపాధి లభిస్తుందని సంస్థ ప్రకటించింది. ఈ మేరకు కేటీఆర్ సమక్షంలో డాన్జ్ సంస్థతో అవగాహన ఒప్పందం కుదిరింది.