తెలంగాణలో 17 లోక్ సభ స్థానాలకు నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 156 మంది నామినేషన్లు దాఖలైనట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. మూడు రోజుల్లో అత్యధికంగా మల్కాజిగిరిలో16 మంది అభ్యర్థులు నామినేషన్లు వేసినట్లు చెప్పారు. శనివారం మూడో రోజు 65 మంది 77 సెట్ల నామినేషన్లు దాఖలు చేసినట్లు వెల్లడించారు.
ఆదిలాబాద్‌లో ఆరు, కరీంనగర్, సికింద్రాబాద్ లో మూడు, నిజామాబాద్, హైదరాబాద్, వరంగల్ లో నాలుగు, జహీరాబాద్, భువనగిరి, చేవెళ్లలో ఐదు, మెదక్ లో ఎనిమిది మంది, మల్కాజిగిరిలో ఏడుగురు నామినేషన్లు దాఖలు చేసినట్లు అధికారులు వివరించారు. మరోవైపు ఉపఎన్నిక జరుగుతున్న సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ సెగ్మెంట్ లో మూడో రోజు కూడా నామినేషన్లు దాఖలు కాలేదు. ఇవాళ ఆదివారం సెలవు రోజు కాబట్టి.. నామినేషన్ల స్వీకరణ ఉండదని ఇప్పటికే అధికారులు ప్రకటించిన విషయం తెలిసిందే. నామినేషన్ల ప్రక్రియ 25వ తేదీ వరకు కొనసాగనుంది. 26వ తేదీన పరిశీలన, 29వ తేదీన ఉపసంహరణ గడువు ఉండనుంది. ఇక మే 13వ తేదీన లోక్సభ ఎన్నికల పోలింగ్ జరగనుంది. జూన్ 4వ తేదీన ఫలితాలు వెలువడనున్నాయి.