తెలంగాణలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్)- 2024కు దరఖాస్తుల గడువు శనివారంతో ముగిసింది. ఈ పరీక్ష కోసం రాష్ట్ర వ్యాప్తంగా 2,83,441 మంది అభ్యర్థులు దరఖాస్తులు చేసుకున్నారు. పేపర్ – 1కి 99,210 మంది, పేపర్ – 2కి 1,84,231 మంది అప్లై చేసినట్లు విద్యాశాఖ తెలిపింది. దరఖాస్తులోని వివరాలను సవరించుకునేందుకు అవకాశం ఇవ్వగా..పేపర్ – 1లో 6,626 మంది, పేపర్ – 2లో 11,428 మంది సరి చేసుకున్నట్లు వెల్లడించింది. కంప్యూటర్ ఆధారిత విధానంలో నిర్వహించే పరీక్షలను మే 20వ తేదీ నుంచి జూన్ 3వ తేదీ వరకు నిర్వహిస్తామని విద్యాశాఖ ప్రకటించింది. పరీక్ష ఫలితాలు జూన్ 12వ తేదీన విడుదల చేస్తామని వెల్లడించింది.
మరోవైపు ఉపాధ్యాయుల పదోన్నతులకు అడ్డంకిగా ఉన్న టెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలని తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం (టీపీయూఎస్) జాతీయ ఉపాధ్యాయ విద్యామండలి (ఎన్‌సీటీఈ)ని కోరింది. ప్రాథమిక పాఠశాలల్లో బోధిస్తున్న వారి పదోన్నతులకు టెట్ అవసరం లేదని, ఇన్ సర్వీసులో ఉన్న ఎస్‌జీటీ ఉపాధ్యాయులకు, స్కూల్ అసిస్టెంటు పదోన్నతులకు మాత్రమే టెట్ రాయాలని అన్నారు.