రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడిగా మాజీ మంత్రి జి. చిన్నారెడ్డి ప్రజాభవన్ లో పూజలు చేసి బాధ్యతలు స్వీకరించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తనపై నమ్మకంతో ఇచ్చిన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తిస్తానని అన్నారు. కేసీఆర్ తెలంగాణ ఏర్పాటుకు ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను తుంగలో తొక్కారన్న చిన్నారెడ్డికాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 90 రోజులు కాక ముందే 4 పథకాలను అమలు చేశారని కొనియాడారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ తప్పకుండా అమలు చేస్తుందని హామీ ఇచ్చారు. మరోవైపు గత కేసీఆర్ ప్రభుత్వంపై చిన్నారెడ్డి నిప్పులు చెరిగారు.
తెలంగాణ ఏర్పాటుకు ముందు ప్రజలకిచ్చిన వాగ్దానాలన్నీ పదవి రాగానే కేసీఆర్ మరిచిపోయారని చిన్నారెడ్డి విమర్శించారు. తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీతో స్వరాష్ట్రం సిద్ధించగానే తమ పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేస్తానని ఇచ్చిన మాట తప్పారని మండిపడ్డారు. పదేళ్ల పాలనలో కేసీఆర్ తెలంగాణను అప్పులకుప్పగా మార్చారని ఆరోపించారు. గతంలో రూ.70వేల కోట్లు ఉన్న అప్పులు ఈ పదేళ్ల పదింతలు పెరిగాయని ధ్వజమెత్తారు.