తెలంగాణలో మొత్తం 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లోని ముసాయిదా ఓటర్ల జాబితాను ఎన్నికల సంఘం తాజాగా విడుదల చేసింది. తెలంగాణలో మొత్తం 3,06,42,333 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో 1,53,73,066 మంది పురుషులు, 1,52,51,797 మంది మహిళలు, 2,133 మంది ఇతరులు, 15,337 మంది సర్వీస్ ఓటర్లు ఉన్నారు. ఈ ఏడాది జనవరి అయిదో తేదీన విడుదల చేసిన జాబితాతో పోలిస్తే ప్రస్తుతం 6,64,674 మంది ఓటర్లు పెరగటం విశేషం.
తెలంగాణలో ఓటర్ల సంఖ్య భారీగా పెరిగిందని ఎన్నికల అధికారులు తెలిపారు. 64 అసెంబ్లీ నియోజకవర్గాల్లో మహిళా ఓటర్లదే పైచేయిగా ఉందని చెప్పారు. ఆయా నియోజకవర్గాల్లో పురుషుల కన్నా మహిళా ఓటర్లే ఎక్కువగా నమోదు కావటం విశేషమన్నారు. మునుపెన్నడూ లేనివిధంగా 18-19 సంవత్సరాల మధ్య వయసువారిలో తొలిసారి ఓటరుగా నమోదు 4,76,597 మంది నమోదు చేసుకున్నారని వెల్లడించారు.
ముసాయిదా ఓటర్ల జాబితాపై అభ్యంతరాలు, మార్పులు, చేర్పులను వచ్చే నెల 19వ తేదీ వరకు నమోదు చేసుకోవచ్చని ఎన్నికల సంఘం తెలంగాణ రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి వికాస్‌రాజ్ పేర్కొన్నారు. వాటిని పరిశీలించి ఈ ఏడాది అక్టోబరు నాలుగో తేదీన తుది జాబితాను ప్రకటిస్తామని తెలిపారు.