తెలంగాణలో ఇవాళ భారీ వర్షాలు కురవనున్నాయని హైదరాబాద్ వాతావరణ శాఖ కేంద్రం వెల్లడించింది. నైరుతి రుతుపవనాల ప్రభావం, బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ప్రభావంతో మరికొద్ది రోజుల పాటు రాష్ట్రంలో వర్షాలు కొనసాగనున్నాయని తెలిపింది. రానున్న ఐదు రోజుల పాటు రాష్ట్రంలో భారీ వర్షాలు కురవనున్నాయని అంచనా వేసింది.
రాష్ట్రంలో ఇవాళ ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాల్లో భారీ వర్షాలు పడనున్నట్లు వాతావరణశాఖ హెచ్చరించింది. ములుగు, నల్లగొండ, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్‌గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి ఓ మోస్తరు వానలు కురవనున్నట్లు స్పష్టం చేసింది. ఈనెల 8వ తేదీ నుంచి 11వ తేదీ వరకు రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో వర్షాలు పడనున్నాయి. వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణశాఖ అధికారులు సూచించారు.
ఈరోజు హైదరాబాద్‌లో ఆకాశం మేఘావృతమై ఉంటుందని, సాయంత్రం లేదా రాత్రి సమయాల్లో వర్షం పడే సూచనలు కనిపిస్తున్నట్లు వాతావరణశాఖ తెలిపింది. నగరంలో నేడు గరిష్ణ ఉష్ణోగ్రత 30 డిగ్రీలలోపు నమోదయ్యే అవకాశముందని అంచనా వేసింది.