గత వారం ఐదు రోజులు వరుసగా వర్షాలు కురిశాయి. రెండ్రోజుల నుంచి కాస్త గ్యాప్ ఇచ్చిన వర్షం మళ్లీ తెలంగాణ వాసులను ఇబ్బంది పెట్టేందుకు సిద్ధమవుతోంది. రాష్ట్రంలో రానున్న మూడు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ నెల 25, 26 తేదీల్లో అక్కడక్కడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. ఈ క్రమంలోనే రాష్ట్రంలో ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.
రాష్ట్రంలో ఇవాళ తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఆదివారం రోజున ఆదిలాబాద్, ములుగు, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబ్‌నగర్ తదితర జిల్లాల్లో వర్షాలు పడ్డాయి. అత్యధికంగా ఆదిలాబాద్ జిల్లా తాంసిలో 31.8 మిల్లీమీటర్ల వర్షం కురిసినట్లు వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా 3.8 మిల్లీమీటర్ల సగటుతో వర్షాలు కురిశాయని.. ప్రస్తుత వానాకాలం సీజన్‌లో ఆదివారం వరకు 295.4 మిల్లీమీటర్లకు గాను 352.9 మిల్లీమీటర్ల వర్షపాతం (19 శాతం అధికం) నమోదైందని వివరించారు..