రాష్ట్రంలో గత రెండ్రోజులుగా పలుచోట్ల వర్షాలు కురుస్తున్నాయి. అకస్మాత్తుగా కురుస్తున్న వానలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. అయితే మరో రెండ్రోజుల పాటు తెలంగాణలో వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతారవణ శాఖ అధికారులు తెలిపారు. ఈశాన్య, తూర్పు మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడినట్లు వెల్లడించారు. దీనికి అనుబంధంగా ఆవర్తనం కూడా ఏర్పడినట్లు పేర్కొన్నారు. వీటి కారణంగా శని, ఆదివారాల్లో రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రకటించారు.
మరోవైపు శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా భారీ నుంచి తేలికపాటి వర్షాలు పడ్డాయి. సిద్దిపేట జిల్లా మర్కూక్ మండలంలో 9.9 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. జగిత్యాల జిల్లా ధర్మపురిలో 8.2, నిజామాబాద్ జిల్లా బాల్కొండ 8, మెదక్ జిల్లా కౌడిపల్లి 7.4, మంచిర్యాల జిల్లా దండేపల్లి 6.7, కరీంనగర్ జిల్లా గంగాధర 6.4, పెద్దపల్లి జిల్లా రామగుండం 6.2 సెం.మీ. కురిసినట్లు తెలిపింది. హైదరాబాద్ నగరవ్యాప్తంగా, పరిసర జిల్లాల్లోనూ తేలికపాటి వర్షాలు పడ్డాయి.