అధిక ఉష్ణోగ్రతలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న రాష్ట్ర ప్రజలకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం చల్లని కబురు చెప్పింది. తెలంగాణ ప్రజలకు నైరుతి రుతుపవనాలు కాస్త ఉపశమనం కలిగించే సంకేతాలు అందించాయి. ఈ నెల 11 నుంచి కర్ణాటక-ఏపీ సరిహద్దుల వద్ద నిలిచిపోయిన రుతుపవనాల్లో కదలిక ప్రారంభమైంది. ఈ నెల 22వ తేదీ నాటికి తెలంగాణలోకి ప్రవేశించే అవకాశాలు ఉన్నట్లు వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. మరోవైపు ఇవాళ రాష్ట్రంలో కొన్నిచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది.
రాష్ట్రంలో ఎండల తీవ్రత కొనసాగుతూనే ఉంది. మంగళవారం రోజున పలుచోట్ల సాధారణం కన్నా అధికంగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఖమ్మం, రామగుండం, మెదక్, భద్రాచలం ప్రాంతాల్లో సాధారణం కన్నా 6 డిగ్రీలకు పైగా నమోదయ్యాయి. 13 జిల్లాల్లోని 36 మండలాల్లో వడగాలులు వీచాయి. 10 మండలాల్లో తీవ్రత ఎక్కువగా నమోదయింది. ప్రజలంతా ఎండల నుంచి అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు.