గజగజ వణుకుతున్న తెలంగాణ.. పడిపోతున్న ఉష్ణోగ్రతలు

-

చలిపులి తెలంగాణపై పంజా విసురుతోంది. శీతలగాలులకు రాష్ట్ర ప్రజలు వణికిపోతున్నారు. రాష్ట్రంలో చలితీవ్రత రోజురోజుకు పెరిగిపోతోంది. పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రత సాధారణంకన్నా 4 నుంచి 6 డిగ్రీలు తక్కువగా నమోదవుతోంది. ఆదివారం తెల్లవారుజామున రాష్ట్రంలోకెల్లా అత్యల్పంగా కుమురం భీం జిల్లా సిర్పూరు(యు)లో 7.3, ఆదిలాబాద్‌లో 9.2, మెదక్‌లో 10, హైదరాబాద్‌ శివారు నందనవనంలో 11.7 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ప్రస్తుత సీజన్‌లో ఇంత తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవడం ఇదే తొలిసారి.

రాష్ట్రంలో గత పదేళ్లలో నవంబరు నెలలో అత్యల్ప ఉష్ణోగ్రత 6.8 డిగ్రీలు. ఆదిలాబాద్‌లో 2017లో ఇది నమోదైంది. ఈ ఏడాది ఆ రికార్డు చెరిగిపోయి ఇంకా తక్కువ ఉష్ణోగ్రత నమోదయ్యే సూచనలున్నాయని అంచనా. ప్రస్తుతం పగటి ఉష్ణోగ్రతలు సైతం పడిపోతున్నాయి. ఆదివారం పగలు భద్రాచలంలో 27, హైదరాబాద్‌లో 28 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇవి సాధారణంకన్నా 4 డిగ్రీలు తక్కువ. ఉత్తర, ఈశాన్య భారత ప్రాంతాల నుంచి తక్కువ ఎత్తులో తెలంగాణలోకి గాలులు వీస్తున్నందున ఉష్ణోగ్రతలు పడిపోయి చలి తీవ్రత పెరుగుతోందని వాతావరణశాఖ రాష్ట్ర అధికారి తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version