హైదరాబాద్ సిటీ బస్సులో శుక్రవారం రోజున ఓ శిశువు జన్మించిన విషయం తెలిసిందే. స్వయంగా లేడీ కండక్టర్ గర్భిణీకి డెలివరీ చేశారు. ఈ విషయంపై ఇప్పటికే రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ఆర్టీసీ ఎండీ సజ్జనార్ స్పందించారు. ఈ సందర్భంగా లేడీ కండక్టర్ను అభినందించారు. మరోవైపు తల్లీ బిడ్డ ఆరోగ్యంగా ఉండటంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
అయితే బస్సులో జన్మించిన శిశువుకు తెలంగాణ ఆర్టీసీ బంపర్ ఆఫర్ ఇచ్చింది. ఆ పాపకు జీవితకాలం పాటు ఉచిత ప్రయాణానికి బస్‌పాస్ ఇస్తున్నట్లు టీజీఆర్టీసీ ప్రకటించింది. గర్భిణికి పురుడు పోసి మానవత్వం చాటుకున్న కండక్టర్ సరోజ, డ్రైవర్ ఎంఎం అలీ సేవలను ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ప్రశంసించారు. బస్‌భవన్‌లో ఉన్నతాధికారులతో కలిసి శనివారం రోజున వారిని సన్మానించారు. గర్భిణి శ్వేతారత్నం ముషీరాబాద్ డిపో బస్సులో శుక్రవారం ఉదయం ఆరాంఘర్ నుంచి వెళ్తుండగా పురిటి నొప్పులు ఎక్కువవ్వడంతో కండక్టర్ మహిళా ప్రయాణికుల సాయంతో ప్రసవం చేసిన విషయం తెలిసిందే.