సార్వత్రిక ఎన్నికల వేళ మాజీ గవర్నర్ తమిళి సై సౌందర్య రాజన్ కీలక వ్యాఖ్యలు చేశారు. తాను తెలంగాణ గవర్నర్ గా ఉన్నప్పుడు తనకు తెలంగాణ ప్రజల మధ్య బీఆర్ఎస్ నేతలు గ్యాప్ క్రియేట్ చేశారని ఆరోపించారు. సంగారెడ్డిలో విశిష్ట సంపర్క అభియాన్ కార్యక్రమంలో పాల్గొన్న ఆమె మాట్లాడారు. ఆయుష్మాన్ భారత్ పథకం తెలంగాణలో ప్రవేశపెట్టడానికి తాను కృషి చేస్తే.. బీఆర్ఎస్ సహకరించలేదని స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వ పథకాలు తెలంగాణలో అమలు చేసి ప్రజలకు అందించాలనేదే తన లక్ష్యమని తెలిపారు.
దేశంలో కాంగ్రెస్ పరిస్థితిపై ఆమె మాట్లాడుతూ.. రాహుల గాంధీ ఎప్పుడు ఎక్కడి నుంచి పోటీ చేస్తాడో ఆయనకే తెలియదని దుయ్యబట్టారు. అసలు కాంగ్రెస్ లో ప్రధాని అభ్యర్థి ఎవరో వాళ్ళకే తెలియదన్నారు. మొదట తమ అభ్యర్థి ఎవరో చెప్పి.. ప్రజలను ఓట్లు అడగాలన్నారు. కాంగ్రెస్ పార్టీలో ప్రధాన మంత్రి అయ్యే అర్హత ఎవ్వరికీ లేదని.. కీలక వ్యాఖ్యలు చేశారు. గతంలో తెలంగాణ గవర్నర్ గా పనిచేసిన తమిళి పై సౌందర్య రాజన్ ఇటీవల తన పదవికి రాజీనామా చేశారు. లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో తమిళనాడులో ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దిగారు.