గుడిలో దొంగతనానికి ప్రయత్నించిన వ్యక్తిని ఆ గుడి వాచ్మెన్ చూశాడు. చోరీని అడ్డుకోవడంతో దొంగ వాచ్మెన్పైకి రాళ్లు విసిరాడు. అతడి నుంచి తప్పించుకునేందుకు వాచ్మెన్ కర్రతో కొట్టడంతో దొంగ అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటన హైదరాబాద్ కుషాయిగూడలోని వేంకటేశ్వరస్వామి ఆలయంలో చోటుచేసుకుంది.
ఇవాళ ఉదయం ఆలయానికి వచ్చిన అర్చకులు గుడిలో మృతదేహం చూసి షాకయ్యారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు రంగయ్యను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ‘నేను కాపలా ఉన్న వేంకటేశ్వర స్వామి ఆలయంలోకి రాత్రి ఓ దొంగ చొరబడ్డాడు. హుండీ, దేవుడి ప్రతిమను తీసుకువెళ్లేటప్పుడు చప్పుడు విని నేను లేచాను. వెంటనే దొంగను అడ్డుకున్నాను. అతడు నాపై రాళ్లతో దాడి చేశాడు. అతణ్ని అడ్డుకునే ప్రయత్నంలో నేను కర్రతో బలంగా కొట్టాను.’ అని వాచ్మెన్ రంగయ్య పోలీసులకు చెప్పినట్లు తెలుస్తోంది.