భద్రతా వలయంలో రేవంత్‌ రెడ్డి నివాసం

-

తెలంగాణ నూతన ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ హైకమాండ్ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డిని ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో హైదరాబాద్​లోని రేవంత్ నివాసానికి భారీ ఎత్తున హస్తం కార్యకర్తలు, అభిమానులు తరలివస్తున్నారు. ఈ క్రమంలో ఆయన నివాసం వద్ద పోలీసులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నారు. రేవంత్‌రెడ్డి చాలా ఏళ్లుగా జూబ్లీహిల్స్‌ రోడ్డు నంబరు 44లో నివాసముంటున్న విషయం తెలిసిందే. సమీపంలోని 44ఎ రోడ్డులోనే ఆయన మల్కాజిగిరి పార్లమెంటు నియోజకవర్గ కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకున్నారు.

అయితే ఇప్పుడు అక్కడే కొన్ని రోజులు ప్రజా దర్బార్‌ నిర్వహించేందుకు సన్నాహాలు చేయాలని పోలీసులకు సమాచారం అందినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలోనే రేవంత్ నివాసం, కార్యాలయాల వద్ద పోలీసులు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆయా ప్రాంతాల్లో విద్యుదీకరణ, రహదారుల శుభ్రత, ఇతర పనులు పూర్తిచేసే దిశగా జీహెచ్‌ఎంసీ అధికారులు బిజీ అయ్యారు.

ప్రస్తుతం జూబ్లీహిల్స్‌ పోలీసుల ఆధ్వర్యంలో రెండు ప్లటూన్ల బలగాలను విధుల్లో ఉంచినట్లు పోలీసులు వర్గాలు తెలిపాయి. ఇవాళ్టి నుంచి వారికి అదనంగా సాయుధ సిబ్బంది, స్థానిక పోలీసులు అంచెలంచెలుగా విధుల్లో ఉంటారని చెప్పారు. ఈరోజు ఉదయం పోలీసు ఉన్నతాధికారులు, అంతర్గత భద్రత విభాగం(ఐఎస్‌డబ్ల్యూ), ట్రాఫిక్‌ విభాగం అధికారులు అక్కడి పరిస్థితులు, భద్రతపరంగా ఉన్న లోపాలు, వాటిని చక్కదిద్దేందుకు తీసుకోవాల్సిన చర్యలు, రూట్‌మ్యాప్‌ తదితరాలు స్వయంగా పరిశీలిస్తామని వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version