తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కులగణన అంశం పై కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ రోజు దేశ చరిత్రలో నిలిచిపోయే రోజు అవుతుందని ఆయన పేర్కొన్నారు. కులగణణ ప్రక్రియ ప్రారంభించడంతో దేశ వ్యాప్తంగా ప్రధాని పై ఒత్తిడి పెరుగనుందని.. అన్ని రాష్ట్రాల్లో కూడా కులగణన చేయాలని డిమాండ్ రాబోతుందని తెలిపారు.
ఈ నిర్ణయంతో బీసీ, ఎస్సీ, మైనార్టీలకు న్యాయం జరుగుతుందని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. భవిష్యత్ లో తమ ప్రభుత్వం ప్రవేశపెట్టే డాక్యుమెంట్ దేశానికి రిఫరెన్స్ అవుతుందని పేర్కొన్నారు. 2011 జనాభా లెక్కల తరువాత మళ్లీ తమ ప్రభుత్వమే ఈ గణన చేపట్టిందని.. 2014లో లెక్కలు ఎక్కడ ఉన్నాయో ఎవరు చేశారో తాము చెప్పలేమని వ్యాఖ్యానించారు సీఎం రేవంత్ రెడ్డి. సుప్రీంకోర్టు సూచించినట్టుగానే కులగణనను అమలు చేస్తున్నామని వెల్లడించారు. కులగణన ఆధారంగానే సీట్ల కేటాయింపు.. పదవుల పంపిణీ జరుగుతుందని స్పష్టం చేశారు. ఎవరైనా అభ్యంతరం వ్యక్తం చేస్తే.. మళ్లీ కోర్టును ఆశ్రయించవచ్చని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.