హైదరాబాద్ మహానగరంలో ట్రాఫిక్ జామ్ చాలా కామన్. అయితే మెట్రో, ఫూట్ ఓవర్, ఫ్లై ఓవర్, స్కై వాక్‌ల పుణ్యమా అని ట్రాఫిక్ కాస్త తగ్గిందని చెప్పొచ్చు. అయితే కొన్ని ప్రాంతాల్లో ఇంకా మెట్రో పనులు, ఫ్లై ఓవర్ల పనులు జరుగుతుండటం వల్ల వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది. ఆ మార్గాల్లో తరచూ ట్రాఫిక్ జామ్ ఏర్పడుతూ నగరవాసులను ఇబ్బందులకు గురి చేస్తోంది.
ఈ క్రమంలోనే తాజాగా హైదరాబాద్ – విజయవాడ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. హైదరాబాద్ నగర శివారు ప్రాంతాల్లో హైవే విస్తరణ పనులు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ ప్రాంతంలో ట్రాఫిక్ స్తంభించింది. వాహనాలు నెమ్మదిగా ముందుకు కదలడంతో ట్రాఫిక్ జామ్ అయిందని అధికారులు తెలిపారు. అబ్దుల్లాపూర్‌మెట్ నుంచి సుమారు 5కి.మీ మేర వాహనాలు నిలిచిపోయాయని వెల్లడించారు. దీంతో వాహనదారులు అసౌకర్యానికి గురవుతున్నారు. రంగంలోకి దిగిన ట్రాఫిక్ పోలీసులు ట్రాఫిక్‌ను క్లియర్ చేసే పనిలో పడ్డారు.