తెలంగాణ శాసనసభ ఎన్నికలకు పోలింగ్ ప్రశాంతంగా సాగుతోంది. ఉదయం 10 గంటల నుంచి నెమ్మదిగా ఓటింగ్ శాతం పుంజుకుంటోంది. ఇప్పుడిప్పుడే భారీ సంఖ్యలో ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు బారులు తీరుతున్నారు. మరికొందరు ఇప్పుడు ఓటు వేసేందుకు హైదరాబాద్ మహానగరం నుంచి ఊళ్లకు బయల్దేరుతున్నారు. ఎన్నికల వేళ స్వస్థలాలకు వెళ్తున్న క్రమంలో నగరంలో పలు చోట్ల ట్రాఫిక్ జామ్ ఏర్పడుతోంది. దీనివల్ల ఓటర్లు ఇబ్బందులు పడుతున్నారు.
ముఖ్యంగా హైదరాబాద్-విజయవాడ హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఎన్నికల నేపథ్యంలో స్వస్థలాలకు రాకపోకలు సాగించే ఓటర్లతో ఈ హైవే రద్దీగా మారింది. ఈ మార్గంలో వాహనాలు నెమ్మదిగా ముందుకు కదులుతున్నాయి. మరోవైపు ఎల్బీ నగర్-ఇబ్రహీంపట్నం రోడ్డుపై వాహనాల రద్దీ ఎక్కువగా ఉంది. ఈ మార్గంలో వెళ్లే వాహనాల రాకపోకలకు అంతరాయం కలుగుతోంది. ఇబ్రహీంపట్నం, మహేశ్వరం, దేవరకొండ, నాగార్జునసాగర్ నియోజకవర్గాలకు కార్లలో వెళుతున్న ఓటర్లతో.. సాగర్ రోడ్డు రద్దీగా మారింది. దీనివల్ల పలు చోట్ల ట్రాఫిక్ నిలిచిపోయి వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు.