తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సంక్షిప్త పేరు టీఎస్‌పీఎస్సీ నుంచి టీజీపీఎస్సీగా మారింది. పేరు మారుస్తూ ప్రభుత్వం ప్రత్యేకంగా ఉత్తర్వులు జారీ చేయకున్నా.. అభ్యర్థులకు సూచనలిస్తూ కమిషన్ కార్యదర్శి నవీన్ నికోలస్ జారీ చేసిన వెబ్ నోట్‌లో టీజీపీఎస్సీగా పేర్కొనడం గమనార్హం. మరోవైపు రాష్ట్రంలో 563 గ్రూప్-1 పోస్టుల భర్తీ కోసం ప్రిలిమినరీ పరీక్ష నిర్వహణకు టీజీపీఎస్సీ పకడ్బందీ ఏర్పాట్లు చేస్తోంది. జూన్ 9వ తేదీన ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు పరీక్ష జరుగుతుంది.
2022లో ఇచ్చిన గ్రూప్-1 నోటిఫికేషన్‌ను రద్దు చేసిన కమిషన్.. 563 ఉద్యోగాలతో ఈ ఏడాది ఫిబ్రవరిలో కొత్త ప్రకటనను జారీ చేసింది. ఫిబ్రవరి 23 నుంచి మార్చి 16 వరకు ఆన్‌లైన్లో దరఖాస్తులు స్వీకరించింది. 4.03 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. గత అనుభవాలు దృష్టిలో ఉంచుకుని ఈసారి పరీక్షలకు పకడ్బందీ చర్యలు తీసుకుంటోంది. నిబంధనలు పాటించడంలో అభ్యర్థులు, సిబ్బంది నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది.