ఇందల్వాయిలో పసుపు లోడ్‌తో వెళ్తున్న లారీ హైజాక్‌

-

పసుపు లోడ్తో వెళ్తున్న లారీని దుండగులు హైజాక్‌ చేసిన ఘటన నిజామాబాద్‌ జిల్లాలో చోటుచేసుకుంది. జిల్లా కేంద్రం నుంచి రెండు రోజుల కిందట పసుపు లోడ్‌తో బయలు దేరిన లారీ గుంటూరు చేరుకోవాల్సి ఉండగా.. ఇందల్‌వాయి టోల్‌ప్లాజా సమీపంలో ఓ కారులో వచ్చిన దుండగులు తాము ఆర్టీఏ అధికారులమంటూ లారీని  నిలిపివేశారు. డ్రైవర్‌కు మత్తు ఇచ్చి.. స్పృహ కోల్పోయిన అతడిని కిందకు దించి లారీని హైజాక్‌ చేసి తిరిగి నిజామాబాద్‌ తీసుకువచ్చారు.

గురువారం పలుచోట్ల పసుపు విక్రయించిన తర్వాత నవీపేట మండలం జన్నేపల్లికి లారీని తరలించారు. లారీలో ఇంకా ఉన్న పసుపు సంచులను ఇతర వాహనాల్లోకి మార్చి అమ్మాలని నిర్ణయించారు. నవీపేటకు చెందిన ఓ వ్యక్తి పసుపు సంచుల కోసం మూడు వాహనాలతో జన్నేపల్లి వెళ్లాడు. అక్కడ వాహనాల్లో పసుపు సంచుల లోడ్‌ నింపుతుండగా స్థానిక పోలీసులకు సమాచారం అందటంతో వారు ఘటనాస్థలికి చేరుకున్నారు. విషయం తెలుసుకున్న డ్రైవర్‌.. లారీని అక్కడే వదిలేసి పారిపోయాడు. మూడు వాహనాల డ్రైవర్లను పోలీసులు పట్టుకుని విచారణ చేస్తున్నారు. లారీలో మొత్తం రూ.50 లక్షల విలువ చేసే పసుపు ఉందని పోలీసులు భావిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news