హైదరాబాద్ మహానగరాన్ని వరణుడు వణికిస్తున్నాడు. నెల గ్యాప్ తర్వాత వర్షం దంచికొడుతోంది. తెల్లవారుజాము నుంచి ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వానతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. భారీ వరద రహదారులను చెరువులుగా మార్చేస్తోంది. చెరువుల్లా మారిన రోడ్లపై ప్రయాణికులు, వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు భారీ వర్షాలతో నగరంలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.
ఇక భారీ వరద ప్రవాహం పోటెత్తడంతో నగరంలోని జంట జలాశయాలు జలకళ సంతరించుకున్నాయి. ఈ క్రమంలోనే ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్ గేట్లను అధికారులు తెరిచారు. భారీ వరద ప్రవాహంతో ఇప్పటికే ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్ జలాశయాలు పూర్తిగా నిండాయి. మరో రెండ్రోజులపాటు భారీ వర్ష సూచనతో అధికారుల అప్రమత్తమ్యయారు.
ఈ క్రమంలోనే ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్ చెరో 2 గేట్లు ఎత్తి.. హిమాయత్‌సాగర్ ద్వారా 1,373 క్యూసెక్కుల నీరు.. ఉస్మాన్‌సాగర్ రెండు గేట్ల ద్వారా 442 క్యూసెక్కులు మూసీలోకి విడుదల చేస్తున్నారు. మరోవైపు మూసీ పరివాహక ప్రాంతాల పట్ల అప్రమత్తంగా ఉండాలని జలమండలి ఎండీ దానకిశోర్ సూచించారు.