ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 3.0 కేబినెట్‌పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇవాళ ఆయన ప్రమాణ స్వీకారం చేయనున్న నేపథ్యంలో ఆయనతో పాటు పలువురు కేంద్ర మంత్రులు కూడా ప్రమాణం చేయనున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రి పదవి ఎవరిని వరించిందోననే ఆసక్తి నెలకొంది. అయితే ఎన్డీఏ కూటమిలోని మిత్రపక్షాలకు 5 నుంచి 8 కేబినెట్ బెర్త్‌లు దక్కే అవకాశం ఉన్నట్లు సమాచారం. కీలకమైన హోంశాఖ, ఆర్థిక శాఖ, రక్షణశాఖ, విదేశాంగ శాఖతో పాటు విద్య, సాంస్కృతిక మంత్రిత్వ శాఖలు బీజేపీ వద్దనే ఉండనున్నట్లు తెలిసింది.
ఈ క్రమంలో తెలంగాణ నుంచి ఎనిమిది ఎంపీ స్థానాలు గెలుచుకున్న బీజేపీకి రెండు పదవులు దక్కనున్నట్లు తెలుస్తోంది. కేంద్ర మంత్రి పదవి రేసులో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, పార్జీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్, పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ ఉన్నారు. అయితే వీరిలో కిషన్ రెడ్డి, బండి సంజయ్ వైపే అధిష్ఠానం మొగ్గు చూపినట్లు తెలిసింది. ఈ ఇద్దరికే కొత్త కేబినెట్‌లో చోటుదక్కినట్లు సమాచారం. ఇక ఏపీ నుంచి తెలుగుదేశం ఎంపీ రామ్మోహన్ నాయుడికి చోటు దక్కినట్లు తెలిసింది.