వేసవి సెలవులు ముగుస్తున్నాయి. జూన్ రెండో వారంలో పాఠశాలలు, కళాశాలలు తెరుచుకోనున్నాయి. ఈ నేపథ్యంలో ప్రజలకు తీర్థయాత్రలకు వెళ్తున్నారు. కుటుంబంతో కలిసి దైవదర్శనం చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే తెలంగాణ ప్రసిద్ధి గాంచిన శ్రీ వేములవాడ రాజరాజేశ్వరస్వామి ఆలయానికి తరలి వస్తున్నారు. పెద్ద ఎత్తున తరలి వస్తున్న భక్తులతో ఆలయం రద్దీగా మారింది.
భక్తుల రద్దీ దృష్ట్యా గర్భాలయంలో అధికారులు అభిషేకాలు, అన్నపూజల సేవలు రద్దు చేశారు. భారీగా భక్తులు బారులు తీరడంతో కోడె మొక్కులు చెల్లించుకునే వారికి 4 గంటల సమయం పడుతోంది. ఇక ప్రత్యేక దర్శనానికి 2 గంటల సమయం పడుతున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. ఓవైపు ఎండలు, మరోవైపు వర్షాలు పడుతున్న నేపథ్యంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురవకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నట్లు వెల్లడించారు.