దక్షిణ కాశీగా ప్రసిద్ధిగాంచిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో భక్తులు బారులు తీరారు. ఆదివారం సెలవు రోజు కావడంతో భారీగా భక్తులు తరలివచ్చారు. పెద్ద ఎత్తున తరలివస్తున్న భక్తులతో ఆలయ ప్రాంగణం సందడిగా మారింది. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులు ధర్మగుండంలో పుణ్యస్నానాలు ఆచరించారు.
అనంతరం స్వామివారికి ప్రీతిపాత్రమైన కోడె మొక్కులను చెల్లించుకుని స్వామివారిని దర్శించుకున్నారు. భక్తుల రద్దీ కారణంగా గర్భాలయంలో అభిషేకాలు ఆర్జిత సేవలు రద్దు చేశారు. స్వామి వారి దర్శనానికి మూడు గంటల సమయం పడుతోందని ఆలయ అధికారులు తెలిపారు. పెద్ద ఎత్తున తరలి వస్తున్న భక్తులకు కావాల్సిన ఏర్పాట్లు అన్నీ చేశామని వెల్లడించారు.