కేసీఆర్ సభ పై రాములమ్మ హాట్ కామెంట్స్ చేశారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు పెద్ద ప్రాజెక్టులు కట్టాము, సంక్షేమ పథకాలు అమలు చేశామని కేసీఆర్ గారు చెప్పుకున్నారు. కానీ ఈ పథకాలు, ప్రాజెక్ట్‌ల పేరు చెప్పి 7 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసిన విషయాన్ని, వాటి ద్వారా కేసీఆర్ గారి కుటుంబం కమీషన్లు తీసుకున్న విషయాన్ని మాత్రం దాచేశారని చురకలు అంటించారు. ఇలా కేసీఆర్ గారి కుటుంబం కమిషన్ల రూపంలో దోచుకున్న ప్రభుత్వ సొమ్మును తిరిగి ఖజానాకు రాబట్టగలిగితే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన ప్రధాన హామీలను అమలు చేయడానికి నిధులు అవసరం కన్నా ఎక్కువే సమాకూరుతాయని పేర్కొన్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వానికి తొత్తులుగా మారి, హద్దులు దాటవద్దని కేసీఆర్ గారు పోలీస్ వారికి వార్నింగ్ ఇవ్వడం చాలా విడ్డూరం అన్నారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు పోలీసులను తొత్తులుగా వాడుకుని, చట్ట విరుద్ధంగా పోలీసులతో ప్రత్యర్థుల ఫోన్లు టాప్పింగ్ చేయించారు. మీ ఉచ్చులో పడిన కొందరు పోలీసు అధికారులు హద్దులు దాటడం వల్ల, ఇప్పుడు దేశ సరిహద్దులు దాటి, దొంగల మాదిరిగా దాక్కోవాల్సిన దుస్థితి వచ్చిందని ఫైర్ అయ్యారు. బీఆర్ఎస్ హయాంలో వరంగల్ బిడ్డలు శృతి, సాగర్‌లను కిరాతకంగా ఎన్కౌంటర్ చేయించిన కేసీఆర్ గారు, గద్దర్ గారు కలవడానికి వస్తే ప్రగతి భవన్ గేట్లను కూడా తెరవని కేసిఆర్ గారు… ఇప్పుడు మావోయిస్టులను చర్చలకి పిలవాలని కేంద్రాన్ని డిమాండ్ చెయ్యడం కేవలం అవసరవాదం అని తెలిపారు.