ఎల్లంపల్లి నుంచి మధ్యమానేరుకు నీటి ఎత్తిపోత

-

పెద్దపల్లి జిల్లా శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టుకు వరద తగ్గినా గోదావరి జలాల తరలింపు ప్రక్రియ నిరంతరం కొనసాగుతోంది. ఎగువనున్న రిజర్వాయర్లను నింపే లక్ష్యంతో ఈ నెల మొదలైన ఎత్తిపోతలు నిరాటంకంగా సాగుతున్నాయి. తొలుత 4 మోటార్లతో 12,600 క్యూసెక్కులను తరలించిన అధికారులు.. ఆ తర్వాత 5 మోటార్లతో 15,750 క్యూసెక్కులను ఎగువకు పంపిస్తున్నారు. ఎల్లంపల్లి జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టానికి సమీపించడంతో పాటు.. 8వేల క్యూసెక్కులకు ఇన్‌ఫ్లో తగ్గినప్పటికీ నంది పంపుహౌస్‌లో 5వ పంపును ఆన్‌ చేశారు. 15,750 క్యూసెక్కుల జలాలు నంది మేడారం రిజర్వాయర్‌లోకి చేరుతున్నాయి.

నంది రిజర్వాయరు నుంచి 15,750 క్యూసెక్కులను గాయత్రి పంపుహౌస్‌కు సొరంగాల ద్వారా వదులుతున్నారు. రామడుగులోని గాయత్రి పంపుహౌస్‌లోనూ 5 మోటార్ల ద్వారా వరద కాలువలోకి ఎత్తిపోస్తున్నారు. దీంతో మధ్యమానేరు జలాశయానికి 15,700 క్యూసెక్కుల ప్రవాహం చేరుతోంది. మధ్యమానేరు జలాశయం పూర్తి స్థాయి 27.54 టీఎంసీల సామర్థ్యానికి 8.50 టీఎంసీలకు చేరింది. ఎల్లంపల్లి జలాశయానికి ఎగువన కడెం జలాశయం నుంచి వదిలిన 3600 క్యూసెక్కులతో.. గోదావరి పరివాహక ప్రాంతాల నుంచి 4800 క్యూసెక్కులు కలుపుకొని 8 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 148 మీటర్లకుగాను 147.15 మీటర్లకు చేరింది. 20.175 టీఎంసీలకు గాను 17.81 టీఎంసీల జలాలు నిల్వ ఉన్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version