ఖమ్మం జిల్లాలో పొలిటికల్ హీట్ పెరుగుతోంది. బిఆర్ఎస్ నుంచి బహిష్కృతులైన మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్న విషయం తెలిసిందే. జూన్ రెండవ తేదీన కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ సమక్షంలో ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారు. ఈ నేపథ్యంలో గత కొద్ది రోజులుగా కేసీఆర్ ని గద్దె దించడమే తన లక్ష్యమని చెబుతున్నారు పొంగులేటి.
ఈ క్రమంలో పొంగులేటి కి వార్నింగ్ ఇస్తూ తాజాగా నేడు ఉదయం ఖమ్మంలో పోస్టర్లు వెలిశాయి. ఆ పోస్టర్లలో పొంగులేటి అనుచరుల శవాలు కూడా మిగలవంటూ హెచ్చరికలు జారీ చేశారు. మంత్రి పువ్వాడ అజయ్ పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని గుర్తు తెలియని వ్యక్తులు ఈ పోస్టర్లు అంటించారు. అయితే వీటిపై తాజాగా స్పందించారు పొంగులేటి.
ఖమ్మంలో జరిగే తెలంగాణ జన గర్జన సభను అడ్డుకోవడానికి మంత్రి పువ్వాడ అజయ్ ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. తన అనుచరులను చంపేస్తామని పోస్టర్లు వేసి బెదిరిస్తున్నారని.. కార్యకర్తలను తాను కాపాడుకుంటానని వెల్లడించారు. ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా సభ విజయవంతం చేసి తీరుతామని.. ఖమ్మంలో ఏం జరిగినా సీఎం కేసీఆర్ బాధ్యత వహించాల్సి ఉంటుందని తెలిపారు.