బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పై మంత్రి శ్రీధర్ బాబు ఫైర్ అయ్యారు. మంగళవారం మహాత్మగాంధీ వర్థంతి సందర్భంగా అసెంబ్లీలోని గాంధీ విగ్రహం వద్ద స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ తో కలిసి శ్రీధర్ బాబు నివాళులర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. పదేళ్ల పాటు అధికారంలో ఉన్నప్పుడు ఎమ్మెల్సీ కవితకు అసెంబ్లీలో జ్యోతిబాపూలే విగ్రహం ఏర్పాటు ఎందుకు గుర్తుకు రాలేదని ప్రశ్నించారు మంత్రి శ్రీధర్ బాబు.
అప్పుడు ఎవ్వరూ అడ్డుకున్నారో ప్రజలకు స్పష్టం చేయాలన్నారు. అప్పటి సీఎం అడ్డుకున్నారా..? లేక స్పీకర్ అడ్డుకున్నారా..? చెప్పాలని డిమాండ్ చేశారు. జ్యోతి బాపూలే జయంతి, వర్థంతి కార్యక్రమాలను అధికారికంగా నిర్వహించిందే కాంగ్రెస్ ప్రభుత్వం అని మంత్రి గుర్తుకు చేశారు. మహానీయులను స్మరించుకోవడంలో కాంగ్రెస్ కి ఎవ్వరో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో లబ్ది పొందేందుకే జ్యోతిబాపూలే అంశం తెరపైకి తీసుకువచ్చారని మండిపడ్డారు. నిజామాబాద్ లో కవిత గెలవనని తెలిసి.. ఓడిపోయే సీటును బీసీలకు కేటాయిస్తామంటున్నారు. గవర్నర్ తీసుకునే నిర్ణయాలను వక్ర బాష్యం పలకడం కేటీఆర్ కి సమంజసం కాదని.. ఎమ్మెల్సీల అంశంపై కోర్టులో కేసు నడుస్తుందని.. న్యాయస్థానానికి కూడా వక్ర భాష్యం పలుకుతారా అని ప్రశ్నించారు మంత్రి శ్రీధర్ బాబు.