మహిళా కార్పొరేటర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు గాను ఎల్బీనగర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి పై తెలంగాణ మహిళా కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ వ్యవహారంలో కమిషన్ ముందు
హాజరయ్యి వివరణ ఇవ్వాలని నోటీసులు జారీ చేసింది. ఎస్టీ మహిళా కార్పొరేటర్ బానోత్ సుజాత
నాయక్ పై అసభ్యకర వ్యాఖ్యలకు చేసినందుకు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని జీహెచ్ఎంసీ ఫ్లోర్ లీడర్ దర్పల్లి రాజశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ కార్పొరేటర్లు మహిళా కమిషన్ చైర్ పర్సన్ నేరెళ్ళ శారదకు ఫిర్యాదు చేశారు. ఆయన నియోజకవర్గంలోని శంకుస్థాపన వ్యవహారంలో జరిగిన గొడవ సందర్భంగా.. కార్పొరేటర్ సుజాత నాయక్ తో దిగజారి మాట్లాడారని.. తక్షణమే ఆయనపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఒక ఎస్టీ మహిళను కాబట్టే తనపై ఇష్టం వచ్చినట్టు నోరు పారేసుకున్నారని సుజాత నాయక్ కమిషన్
ముందు కన్నీటి పర్యంతం అయ్యారు. ఈ వ్యవహారంపై మహిళా కమిషన్ సీరియస్ అయింది. రాజ్యాంగ బద్ధమైన పదవిలో ఉన్న మహిళా కార్పొరేటర్ పై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం అంటే మహిళా లోకాన్ని అగౌరవ పరచడమే అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనిపై కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వాలని.. లేదంటే కఠిన చర్యలు తీసుకుంటామని సుధీర్ రెడ్డికి నోటీసులు జారీ చేసింది.