ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి ఆలయానికి నిత్యం భక్తులు పోటెత్తుతూనే ఉంటారు. ఇక కార్తీక, శ్రావణ మాసం వంటి ప్రత్యేక రోజుల్లో భక్తుల తాకిడి ఇంకాస్త ఎక్కువగానే ఉంటుంది. ఈ ప్రత్యేక రోజుల్లో ఆలయ అర్చకులు స్వామి వారికి ప్రత్యేక పూజలు చేస్తుంటారు. ఇక ఆలయ సిబ్బంది భారీగా తరలి వచ్చే భక్తుల కోసం పకడ్బందీ ఏర్పాట్లు చేస్తుంటారు. ఇలా రద్దీ ఎక్కువవ్వడంతో పాటు ఈ ప్రత్యేక రోజుల్లో యాదాద్రి హుండీకి ఆదాయం కూడా భారీగానే వస్తుంది.
ఈ క్రమంలోనే యాదాద్రి ఆలయ ఖజానాకు కార్తీక మాసంలో రూ.14.91 కోట్లు సమకూరినట్లు ఆలయ అధికారులు తెలిపారు. గతనెల 14న మొదలైన కార్తికం మంగళవారంతో ముగిసిన విషయం తెలిసిందే. ఈ మాసంలో శివ, కేశవుల ఆలయాలున్న ఈ క్షేత్రం సత్యనారాయణస్వామి సామూహిక వ్రతాలు, దీపోత్సవం, తులసీ ఆరాధనలతో యాదాద్రి కిటకిటలాడింది.
కార్తీక మాసం తొలిరోజు నుంచి రోజూ ఆరు సార్లు నిర్వహించిన సామూహిక వ్రతాల్లో 18,824 మంది దంపతులు పాల్గొనగా.. ఈ పూజలతో రూ.1,64,20,600 సమకూరాయని ఆలయ ఈవో గీత తెలిపారు. 37,698 మంది భక్తులు తలనీలాలు సమర్పించారని, ప్రసాదాల విక్రయం ద్వారా రూ.3,50,79,660, బ్రేక్, శీఘ్ర దర్శనాలతో రూ.1,69,19,100, కొండపై వాహనాల పార్కింగ్ రుసుం ద్వారా రూ.1,13,50,000 వచ్చాయని వెల్లడించారు.