ఇటీవల గుండెపోటుతో మరణాలు ఎక్కువవుతున్నాయి. చిన్న పిల్లల నుంచి పండు ముసలి వాళ్ల వరకు అన్ని వయసుల వారూ గుండెపోటుకు గురవుతున్నారు. అకస్మాత్తుగా ఉన్నచోటే కుప్పకూలుతున్నారు. చిన్నవారు, యువత కూడా గుండెపోటుకు గురవ్వడం ఇప్పుడు ఆందోళన రేకెత్తిస్తోంది. చాలా మంది ఇప్పటికే డ్యాన్స్ చేస్తూ.. జిమ్ లో వర్కవుట్ చేస్తూ.. ఉన్నచోటే కుప్పకూలిన ఘటనలు చూస్తున్నాం. తాజాగా ఇలాంటి ఘటనే మేడ్చల్ జిల్లాలో చోటుచేసుకుంది.
మేడ్చల్ జిల్లా కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో విషాద ఘటన చోటుచేసుకుంది. రాంపల్లి దాయరలో క్రికెట్ ఆడుతూ ఓ యువకుడు గుండెపోటుతో మృతి చెందాడు. ప్రణీత్ (32) అనే యువకుడు దాయరలోని త్యాగి స్పోర్ట్స్ వెన్యూ క్రికెట్ గ్రౌండులో క్రికెట్ ఆడుతూ కుప్పకూలాడు. వెంటనే అప్రమత్తమైన సహచర ఆటగాళ్లు అతడిని ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే ప్రణీత్ మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ప్రణీత్ పాత బోయినపల్లికి చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. ఈ ఘటనతో మృతుడి కుటుంబం విషాదంలో మునిగిపోయింది.