భార్య వేధింపులు తాళలేక మరో టెకీ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఉత్తర్ ప్రదేశ్ లో చోటుచేసుకుంది. తన భార్య, ఆమె ఫ్యామిలీ తనను మానసికంగా వేధిస్తోందని ఆరోపిస్తూ ఆత్మహత్య చేసుకున్న టెకీ.. తన మరణం తర్వాత కూడా న్యాయం జరగకపోతే.. తన బూడిదను డ్రైనేజీలో కలపాలని చెబుతూ సెల్ఫీ వీడియో రికార్డు చేశాడు. ఆ వీడియో సమీప బంధువుకు పంపాడు.
మోహిత్ యాదవ్ అనే వ్యక్తి ప్రియ అనే యువతిని ప్రేమించి రెండేళ్ల క్రితం పెళ్లి చేసుకున్నాడు. అయితే తన భార్యకు తన అత్త అబార్షన్ చేయించిందని.. ఆమె వద్ద ఉన్న బంగారు ఆభరణాలు కూడా తన వద్దే పెట్టుకుందని వీడియోలో మోహిత్ పేర్కొన్నాడు. అసలు తాను కట్నం కూడా తీసుకోలేదని.. కానీ తనపై తప్పుడు కేసులు పెట్టారని.. తల్లిదండ్రుల నుంచి తనకు వచ్చిన ఆస్తులను వారి పేరిట బదిలీ చేయాలని భార్య, ఆమె ఫ్యామిలీ చిత్రహింసలకు గురి చేశారని ఆరోపించాడు. వాళ్లు చెప్పినట్లు చేయకపోతే మరిన్ని కేసులు పెడతామని బెదిరించారని తెలిపాడు. ఈ వేధింపులు తట్టుకోలేక తాను ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు వెల్లడించాడు.