తనపై 139మంది లైంగికదాడికి పాల్పడ్డారంటూ నల్లగొండ జిల్లా మిర్యాలగూడకు చెందిన 25 ఏళ్ల ఓ యువతి పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనకు న్యాయం చేయాలని వేడుకుంది. ఈ సందర్భంగా ఆమె కొందరిపేర్లు కూడా బయటకు చెప్పడం కలకలం రేపుతోంది. అయితే.. యువతి ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు విచారణ చేపట్టారు. 139మందిపై నిర్భయ కేసు నమోదు చేశారు. అంతకుముందు ఆ బాధితురాలు గవర్నర్ తమిళసైని కూడా కలిసినట్లు తెలిసింది. ఈ ఘటన కలకలం రేపుతోంది.
అయితే.. బాధితురాలు చేసిన ఫిర్యాదు ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి.. నల్లగొండ జిల్లాకు చెందిన యువతికి మిర్యాలగూడకు చెందిన వ్యక్తితో 2009 జూన్‌లో వివాహమైంది. అత్తవారింట్లో వేధింపులు తట్టుకోలేక 2010 డిసెంబరులో పెద్దల సమక్షంలో విడాకులు తీసుకున్నారు. పుట్టింట్లో ఉండి చదువుకుంటుండగా విద్యార్థి సంఘం నాయకులతో పాటు పలువురితో పరిచయం ఏర్పడింది. కొంతకాలం క్రితం రాజ్‌భవన్ రోడ్డులోని అపార్ట్‌మెంట్‌లో అద్దెకు దిగింది. ఈ క్రమంలో తనపై మాజీ ఎంపీ పీఏ, విద్యార్థి సంఘం నాయకులు ముగ్గురు, మరో 139 మంది కొన్నేళ్లుగా అత్యాచారానికి పాల్పడ్డారని ఫిర్యాదులో బాధితురాలు పేర్కొంది.
* గర్భం దాల్చడంతో అబార్షన్ చేయించారు. నగ్నంగా చిత్రాలు, వీడియోలు తీశారు. సిగరెట్లతో కాలుస్తూ శారీరకంగా హింసించారు. ఎవరికైనా చెబితే చంపేస్తామని తుపాకీతో బెదిరించారు. వారిలో విద్యార్థి సంఘాల నాయకులు, రాజకీయ నాయకుల పీఏలతో పాటు సినీ పరిశ్రమ వారూ ఉన్నారు. ఇప్పుడు వారి నుంచి నాకు ప్రాణహాని ఉంది* అంటూ ఓ యువతి పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనపై సామూహిక అత్యాచారాలు, వేధింపులు తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటు పలు రాష్ట్రాల్లో జరిగాయని తెలిపింది.