సంక్రాంతి పండుగ సందర్భంగా పంతగులు ఎగురవేయడం ఆనవాయితీగా వస్తోంది. చిన్నా పెద్దా అంతా కలిసి కనుమ పండుగ రోజున సరదాగా గాలిపటాలు ఎగురవేస్తుంటారు. అయితే పతంగులు ఎగురవేసే క్రమంలో చాలా మంది అనుకోని ప్రమాదాలకు గురవుతున్నారు. ఈ ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ ఏడాది సంక్రాంతి పండుగ సందర్భంగా పతంగులు ఎగరవేస్తూ ఇప్పటికే పలువురు చిన్నారు మృతి చెందారు.
తాజాగా హైదరాబాద్లో ఓ యువకుడు భవనంపై పడి మరణించాడు. మధురానగర్ పరిధి రహమత్నగర్లో సోమవారం రాత్రి భవనం మూడో అంతస్తుపై నుంచి పడి చౌహాన్ శ్రీదేవ్ (21) అనే కుర్రాడు తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే అతణ్ని ఆస్పత్రికి తరలించినా లాభం లేకపోయింది. అప్పటికే అతను మరణించాడని వైద్యులు తెలిపారు. పోస్టుమార్టం నిమిత్తం అతడి మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు. అయితే తన కుమారుడి మృతిపై అనుమానం ఉందంటూ శ్రీదేవ్ స్నేహితులపై అతడి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారితో కలిసి వెళ్లిన తన కుమారుడు అనుమానాస్పద రీతిలో మరణించాని వాపోయారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే మద్యంమత్తులో గాలి పటాలు ఎగురవేస్తుండగా ప్రమాదవశాత్తు భవనంపై నుంచి పడి ఉంటాడని పోలీసులు ప్రాథమికంగా అనుమానిస్తున్నారు.