జగన్ కేసీఆర్ మధ్య ”మీటర్” దూరం ?

-

ఏందయ్యా మా మధ్య కిరికిర్లు పెట్టాలని చూస్తున్నావా ? నీ ముచ్చట తీరేది కాదు కానీ పోయి కూసో ! ఎక్కువగా ఆశపడుతున్నావ్ ? నీ కిరికిరి నాకర్ధమయ్యిందిలే కూసో పో అంటూ ఓ సందర్భంలో తెలంగాణ సీఎం కేసీఆర్ విలేకర్ల సమావేశాలంలో సీరియస్ గా మాట్లాడిన మాటలు. పోతిరెడ్డిపాడు విషయంలో జగన్ కేసీఆర్ మధ్య వైరం పెరిగింది అన్నట్టుగా పెద్ద ఎత్తున కథనాలు రావడం, విలేకర్లు ఆ కథనాలపై కేసీఆర్ ని ప్రశ్నించగా వచ్చిన సమాధానం ఇది. పోతిరెడ్డిపాడు విషయంలో తెలంగాణ ఆంధ్ర మధ్య వివాదాలు చెలరేగాయి. కేసీఆర్ మాత్రం జగన్ తో స్నేహం పోగొట్టుకునేందుకు ఇష్టపడలేదు. ప్రతిపక్షాలు ఏపీ ప్రభుత్వం పై పెద్ద ఎత్తున విమర్శలు చేసినా, కేసీఆర్ మాత్రం సంయమనం పాటిస్తూ వచ్చారు. తాము సామరస్య పూర్వకంగానే వివాదాలను పరిష్కరించుకునేందుకు చూస్తున్నామని, ఈ విషయంలో కేంద్రం కూడా మా మధ్య విరోధం పెట్టడానికి చూస్తోంది అంటూ అప్పట్లో కేసీఆర్ ఫైర్ అయ్యారు.

ఇది ఇలా ఉంటే కొత్తగా కేంద్రం తీసుకొచ్చిన విద్యుత్ సంస్కరణల విషయంలో ఇప్పుడు కేసీఆర్ జగన్  నిర్ణయాలు భిన్నంగా ఉండటంతో పాటు, ఇద్దరి మధ్య స్నేహానికి ముప్పు పెరిగేలా అనిపిస్తోంది. కేంద్రం తీసుకుంటున్న అన్ని నిర్ణయాలను జగన్ సమర్థిస్తూ వస్తున్నారు. ఆ విధంగానే రైతులకు ఇచ్చే  విద్యుత్ విషయంలోనూ మీటర్లు ఏర్పాటు చేసేందుకు కేంద్రం నిర్ణయం తీసుకోవడంతో దానికి జగన్ అంగీకారం తెలిపారు. కానీ తెలంగాణలో మాత్రం కేసీఆర్ దానిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ నేపథ్యంలో టిఆర్ఎస్ మంత్రి హరీష్ రావు జగన్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు.

కేంద్రం నాలుగు వేల కోట్లు ఇస్తామనేసరికి జగన్ ప్రభుత్వం రైతుల ప్రయోజనాలను తాకట్టు పెద్దింది అంటూ హరీష్ రావు విమర్శించారు. కానీ కేసీఆర్ ప్రభుత్వం జగన్ మాదిరిగా చేయదని, రైతుల ప్రయోజనాలను కాపాడడం మా ధ్యేయమంటూ చెప్పుకొచ్చారు. కేంద్రం సైతం తెలంగాణకు రెండున్నర వేల కోట్లు ఇస్తాం అంటూ ప్రకటించిందని, కానీ మేము వ్యవసాయ కనెక్షన్లకు మీటర్లు బిగించాలనే కేంద్ర నిర్ణయాన్ని ఒప్పుకోవడం లేదని, డబ్బులు పోయినా, రైతుల ప్రయోజనాలే తమకు ముఖ్యం అంటూ హరీష్ వ్యాఖ్యానించారు. అంతేకాకుండా జగన్ బిజెపికి దగ్గర అందుకే ఈ విధంగా కేంద్రం నిర్ణయాలకు మద్దతు ప్రకటిస్తున్నారు అంటూ టిఆర్ఎస్ నాయకులు విమర్శలు చేస్తున్నారు.

ఈ వ్యవహారాలన్నీ చూస్తుంటే కెసిఆర్ జగన్ కు మధ్య దూరం మరింతగా పెరుగుతుందని, దానికి ఈ విద్యుత్ మీటర్ల అంశం మరింత ఆజ్యం పోసింది అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఏపీలో బీజేపీ వైసీపీ ప్రభుత్వాన్ని ఇబ్బందులకు గురి చేస్తూ, తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నా, జగన్ మాత్రం బీజేపీ విషయంలో సైలెంట్ గానే ఉంటున్నారు. కానీ తెలంగాణలో మాత్రం కెసిఆర్, బీజేపీ ఈ వ్యవహారాన్ని ఆషామాషీగా వదిలిపెట్టడం లేదు. ఆ పార్టీ తమకు రాజకీయ ప్రత్యర్థి అని నమ్ముతున్న కెసిఆర్ దానికనుగుణంగానే ఆ పార్టీతో ఢీ కొట్టేందుకు ఎప్పటికప్పుడు సిద్ధంగానే ఉంటున్నారు. అలాగే త్వరలో జాతీయ రాజకీయాల వైపు కేసీఆర్ వెళ్లే ఆలోచనతో ఉండడంతో, బిజెపి పై ఈ విధమైన పోరాటం  చేస్తున్నట్లుగా కనిపిస్తోంది. కానీ తన మిత్రుడైన జగన్ తనకు కలిసిరానట్టుగా వ్యవహరిస్తున్నారని కెసిఆర్ ఈ స్థాయిలో ఫైర్ అవుతున్నట్టుగా వ్యవహరిస్తున్నారు.

-Surya

Read more RELATED
Recommended to you

Exit mobile version