టిఆర్ఎస్ నాయకులపై వైయస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైయస్ షర్మిల గాటు వ్యాఖ్యలు చేశారు. పాలమూరు ఎమ్మెల్యేలు చేతగాని దద్దమ్మలంటూ విమర్శించారు. షర్మిల చేపట్టిన ప్రజా ప్రస్థానం పాదయాత్ర సోమవారం మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల నియోజకవర్గం నుంచి రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గం లోకి అడుగుపెట్టింది. ఈ సందర్భంగా వైయస్ షర్మిల మాట్లాడుతూ.. టిఆర్ఎస్ నాయకుల అవినీతిని ప్రశ్నించినందుకు తనపై స్పీకర్ కు ఫిర్యాదు చేస్తారా అని మండిపడ్డారు.
తెలంగాణలో తన పాదయాత్ర జరగకుండా ఆపేందుకు కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. వారికి దమ్ముంటే ఆపాలని సవాల్ విసిరారు. తన పాదయాత్రతో టిఆర్ఎస్ నాయకుల బండారం బయటపడుతుందని భయం వారికి పట్టుకుందన్నారు. వైయస్సార్ తెలంగాణ పార్టీకి ప్రజల నుంచి వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక టిఆర్ఎస్ ప్రభుత్వం తనను అరెస్టు చేసేందుకు కుట్ర పన్నుతుందని ఆమె ఆరోపించారు.