గత కొంతకాలంగా వైఎస్సార్టీపీని ఆ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కాంగ్రెస్‌లో విలీనం చేస్తారనే ఊహాగాణాలు తెరపైకి వచ్చిన విషయం తెలిసిందే. ఇక ఇటీవల దిల్లీ వెళ్లి సోనియా గాంధీ, రాహుల్ గాంధీలను కలవడంతో విలీనం లాంఛనమేనని అంతా అనుకున్నారు. ఇక తాజాగా విలీనంపై షర్మిల కీలక వ్యాఖ్యలు చేయడంతో ఇదంతా నిజమేనని రుజువైంది.
కేసీఆర్ అవినీతి పాలను అంతమెందించేందుకు కాంగ్రెస్‌తో కలిసి పని చేయాలనే ఉద్దేశంతో సోనియా గాంధీ, రాహుల్ గాంధీతో సుదీర్ఘంగా చర్చించినట్లు వైఎస్ షర్మిల తెలిపారు. కాంగ్రెస్‌లో పార్టీ విలీనంపై చర్చలు తుది దశకొచ్చాయని వెల్లడించారు. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి వర్దంతి సందర్భంగా హైదరాబాద్ పంజాగుట్టలో తండ్రి విగ్రహానికి నివాళులర్పించిన షర్మిల… తన తండ్రిపై వారికి గౌరవముందని నిర్ధారించుకున్న తర్వాతే సోనియా, రాహుల్‌తో చర్చల వరకు వెళ్లినట్లు చెప్పారు.
కేసీఆర్‌కు వ్యతిరేకంగా అన్ని రాజకీయ పార్టీలు కలసి రావాలని షర్మిల పిలుపునిచ్చారు. రాజకీయాలంటే వండినట్లు.. తిన్నట్లు కాదని అన్నారు. రాజకీయాల్లో ముందుచూపు, ఓపిక, గుండె నిబ్బరం ఉండాలని చెప్పారు. తనతో నడిచిన వారిని తనతో పాటే నిలబెడతానని హామీ ఇచ్చారు.