బుగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అదర్వణ వేదం అని నాలుగుంటాయని మనకు తెలుసు. చిన్నప్పుడు చదువుకున్న ఈ వేదాల గురించి మనం తెలుసుకోవాలనుంటే అవి మనకు అర్థమయ్యే భాషలో ఉండేవి కావు. వేదాలపై ఆసక్తి ఉన్న వారి కోసం.. ఈ వేదాలు అందరికీ అర్థమయ్యే భాషలో అందుబాటులో ఉంచాలనే ఆలోచనలతో నాలుగు వేదాల్లోని మంత్రాలను తెలుగులోకి అనువదించారు హైదరాబాద్‌కు చెందిన డాక్టర్ మర్రి కృష్ణారెడ్డి. రాజస్థాన్‌లోని అజ్మేర్లో జరిగిన రిషి ఫెయిర్‌లో ‘దివ్య వేద వాణి’ పుస్తకాన్ని ప్రదర్శించారు. మర్రి కృష్ణారెడ్డి గత 25 ఏళ్లుగా కష్టపడి ఈ పుస్తకాన్ని తెలుగులోకి అనువదించారు. ఎక్కువ పేజీలు, బరువు కారణంగా ‘హై రేంజ్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్’లో ఈ పుస్తకం చోటు దక్కించుకుందని ఆయన తెలిపారు.
“దివ్యవేదవాణి పుస్తకం బరువు 28 కేజీలు. ఇందులో 4,104 పేజీలు ఉన్నాయి. 1996లో దివ్య వేద వాణి పుస్తకాన్ని రాయడం ప్రారంభించాను. 2019 నాటికి పుస్తకం రాయడం పూర్తైంది. కొవిడ్ వల్ల కొంత ఆలస్యమైంది. నా గురువు గోపాదేవ్ శాస్త్రి దగ్గర సంస్కృతం, వేదాలను నేర్చుకున్నాను. ఈ బుక్‌ను పలువురు ప్రముఖులకు అందించాను.”
– డాక్టర్ మర్రి కృష్ణారెడ్డి, రచయిత