చెన్నై: సినీ నటుడు కమల్ హాసన్‌కు ఎదురుదెబ్బ తగిలింది. తమిళనాడులో జరిగిన ఎన్నికల్లో ఆయన పార్టీ మక్కల్ నీది మయ్యమ్ ఘోర ఓటమి పాలైంది. అంతేకాదు ఆ పార్టీ అధ్యక్షుడు కమల్ హాసన్ కూడా ఓడిపోయారు. దీంతో ఆ పార్టీ నేతల్లో నిరుత్సాహం నెలకొంది. ఇతర పార్టీల వైపు చూస్తున్నారు. ప్రధానంగా అధికార పార్టీ వైపు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది.
ఇది ఇలా ఉంటే పదిమంది ముఖ్యనేతలు మక్కల్ నీది మయ్యమ్‌కు రాజీనామా చేశారు. పార్టీ ఉపాధ్యక్షుడితో సహా ముఖ్యనేతలు పార్టీని వీడుతున్నట్లు ప్రకటించారు. దీంతో మక్కల్ నీది మయ్యమ్‌లో కలకలం రేగింది. రాజీనామా చేసిన వారిని బుజ్జగించే ప్రయత్నాలు చేసినా ఫలితం లేకుండా పోయింది. ఎన్నికల్లో గెలుపోటములు సహజమేనని నేతలకు చెప్పినా ప్రయోజనం లేకుండా పోయింది. వరసపెట్టి రాజీనామాలు చేస్తుండటంతో కమల్ పార్టీ మనుగడపై సందేహాలు నెలకొన్నాయి. ఓటమి తర్వాత కమల్ హాసన్ భవిష్యత్ కార్యచరణపై ఇంతవరకు స్పందించలేదు. తమిళనాడులో సినీ నటులకు రాజకీయ జీవితం ఉండదని పలువురు విశ్లేషకులు అంటున్నారు.