వైసీపీ సర్కారు హయాంలో ఏ మంత్రిపైనా రానన్ని ఆరోపణలు ఆ మంత్రి పై వస్తున్నాయి. అవి ఏదో అక్రమాలు చేస్తున్నారనో.. అవినీతిని ప్రోత్సహిస్తున్నారో.. ఏ మాత్రం కాదు. కేవలం.. ఆ మంత్రి సరిగా పనిచేయడం లేదనే..! ఇది ఏకంగా.. ఆ మంత్రి పదవికే ఎసరు పెట్టడం ఖాయమంగా ఉందని అంటున్నారు పరిశీలకులు. ఆమంత్రి ఎవరో కాదు.. గుంటూరు జిల్లాకు చెందినహోం మంత్రి మేకతోటి సుచరిత. ఎస్సీ వర్గానికి చెందిన ఈమెకు జగన్ ఎన్నో ఆశలతో ఈ మంత్రి పదవిని అప్పగించారు. గతంలో తన తండ్రి.. వైఎస్.. తొలిసారి హోం శాఖను ఓసీ మహిళ కు అప్పగించారు. ఆ రికార్డును తిరగరాస్తూ.. ఎస్సీ వర్గానికి చెందిన మహిళకు జగన్ రాష్ట్ర హోం శాఖను అప్పగించారు.
అయితే… జగన్ అంచనాలను ఆమె చేరుకోలేక పోతున్నారనే వాదన అటు అధికార వర్గాల్లోనూ ఇటు ప్రజల్లోను.. అన్నింటికీ మించి.. పార్టీలోనూ వినిపిస్తుండడం గమనార్హం. దిశ చట్టాన్ని జగన్ ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు రక్షణగా ఉంటుందని అసెంబ్లీలోనూ ప్రకటించారు. దీనిని పాస్ చేశారు. అయితే, కొన్ని కేంద్ర చట్టాలు కూడా దీనిలో ఉండడంతో దీనిని కేంద్ర హోం శాఖకు పంపారు. ఇది ఇప్పటికీ కేంద్రం అనుమతికి నోచు కోలేదు. దీనిపై త్వరగా చర్యలు తీసుకునేలా కేంద్రంతో టచ్‌లో ఉండాల్సిన మంత్రి సుచరిత.. తనకు పట్టనట్టు వ్యవహరిస్తుండడంపై సీఎం జగన్ సీరియస్‌గా ఉన్నారని కొన్నాళ్లుగా వార్తలు వస్తున్నాయి.
ఇక, రాష్ట్రంలో తన సామాజిక వర్గానికి చెందిన వారిపైనే దాడులు జరుగుతున్నా.. ఆమె పట్టించుకోనట్టు వ్యవహరిస్తున్నారు. పైగా పోలీసులను అదుపు చేయలేక పోతున్నారని.. డీజీపీనే హోం శాఖ మంత్రిగా వ్యవహరిస్తున్నారనే టాక్ వైసీపీలో వినిపిస్తోంది. ఏదైనా అనుమతి కావాల్సి ఉంటే.. నేరుగా తాము డీజీపీనే అడుగుతున్నామని.. ప్రకాశం జిల్లాకు చెందిన ఓ నేత ఇటీవల వ్యాఖ్యానించారు. అంటే. మంత్రితో సంబంధం లేదనేది స్పష్టమైంది.
తాజాగా నంద్యాలలో అబ్దుల్ సలాం కుటుంబం మూకుమ్మడి ఆత్మహత్య ఘటన మరింతగా హోం శాఖ మెడకు చుట్టుకుంది. ఈ విషయంలో పోలీసులను అరెస్టు చేశారు. వెంటనే బెయిల్ ఇప్పించారు. ఇది కూడా మంత్రి పై ప్రభావం చూపించింది. నేరుగా సీఎం జగన్ జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. ఈ పరిణామాల నేపథ్యంలో సుచరితను జగన్ కొనసాగించే విషయంలో అనేకానేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి.