వైసీపీ సర్కారులో కేబినెట్ పోస్టు దక్కడమే బ్రహ్మాండం అనుకున్నారు నాయకులు. వాస్తవానికి జగన్ ప్రభుత్వం ఏర్పడగానే రాష్ట్రంలో రెడ్డి రాజ్యం వచ్చేసిందని అందరూ భావించారు. అయితే.. ఈ భావనకు బ్రేకులు వేస్తూ.. సీఎం జగన్ వ్యూహాత్మకంగా అన్ని సామాజిక వర్గాలకు న్యాయం చేశారు. ముఖ్యంగా బీసీలు, ఎస్సీలకు ప్రధాన పదవులు అప్పగించారు. పోర్ట్ ఫోలియోలను కూడా మంచివే ఇచ్చారు. దీంతో వారంతా .. తమ తమ సామాజక వర్గాలకు న్యాయం చేస్తారని.. పార్టీకి వారిని చేరువ చేస్తారని అనుకున్నారు. ఇది సహజమే. ఎక్కడైనా జరిగేదే.. అనుకున్నారు. గతంలో చంద్రబాబు కూడా ఇలానే అనుకున్నారు. ఆయా సామాజిక వర్గాలను పార్టీకి చేరువ చేయడంలో మంత్రులు కీలక పాత్ర పోషిస్తారని అనుకున్నారు.
గతాన్ని వదిలేస్తే.. ప్రస్తుత ప్రభుత్వంలో జగన్ బావించిన దానికి భిన్నంగా వ్యవహరిస్తున్నారు మంత్రులు. మొత్తం 24 మంది మంత్రుల్లో ఆరుగురిపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఇవేవీ బయటకు కనిపించడం లేదు. అలాగని దాగడమూ లేదు. నివురు గప్పిన నిప్పు మాదిరిగా.. ఉన్నాయి. మంత్రి కన్నబాబు.. కాపు సామాజిక వర్గానికి చెందిన నాయకుడు. ఈయనకు దూకుడు ఎక్కువనే పేరుంది. అయితే.. ఈయన కాపులను ఏమేరకు పార్టీకి చేరువ చేశారు? అనే విషయాన్ని పరిశీలిస్తే.. ఎన్నికలకు ముందు ఎంత గ్రాఫ్ ఉందో ఇప్పుడు కూడా అంతే గ్రాఫ్ కనిపిస్తోంది. కేవలం.. జగన్ భజనలో తేలియాడుతున్నారు. ఇక, క్షత్రియ కమ్యూనిటీలో రంగనాథరాజుకు అవకాశం ఇచ్చారు. ఈయన నిత్యం వివాదాలు, విభేదాలు.. అనే ఫార్ములాతోనే ముందుకు సాగుతున్నారు. దీంతో క్షత్రియ కమ్యూనిటీలో ఈయనపై వివాదాలు ఉండడం గమనార్హం.
ఎస్సీ సామాజిక వర్గంలో మంత్రిగా మేకతోటి సుచరితకు ఛాన్స్ ఇచ్చారు. ఈమె వివాదాలకు దూరంగా ఉన్నా.. తన సత్తా చూపించలేక పోతున్నారు. పలితంగా ఎస్సీ సామాజిక వర్గంలో చీలకలు వస్తున్నాయి. వైసీపీకి ఎంతో బలమైన ఓటు బ్యాంకు దూరమయ్యే పరిస్థితి వచ్చిందని అంటున్నారు పరిశీలకులు. ఇక, ఎస్టీ వర్గాల్లో కీలకమైన ఓటు బ్యాంకు ఉన్న వైసీపీ తరఫున ఉప ముఖ్యమంత్రిగా పుష్ప శ్రీవాణి వ్యవహరిస్తున్నారు. అయితే.. ఆమె ఎప్పుడు ఎక్కడ ఉంటున్నారో.. అసలు ఉన్నారో .. లేరో.. అన్నట్టుగా ఉన్నారు. దీంతో ఎస్టీలను పట్టించుకునే నాథుడు కనిపించడం లేదని అంటున్నారు. మంత్రి తానేటి వనిత.. ఓ అమాయక చక్రవర్తిగా వ్యవహరిస్తున్నారని.. అధికారులే పేర్కొంటున్నారు. అన్నింటికీ భయపడుతున్నారని.. ఏ కార్యక్రమం చేయాలన్నా.. ప్రతిపక్షాలు వంకలు పెడతాయి.. అంటున్నారని.. అధికారులు బాహాటంగానే విమర్శలు గుప్పిస్తున్నారు.
ఇక, అంజాద్ బాషా.. కడపకు చెందిన సీనియర్ నాయకుడు. ముస్లిం మైనార్టీ వర్గం తరుఫున డిప్యూటీ సీఎంగా ఉన్నారు. ఈయన రెండు మాటలు మాట్లాడితే.. ఎక్కువ.. అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. పార్టీ కార్యక్రమాలను కూడా ఆచితూచి ఎంచుకుని ముందుకు సాగుతున్నారు కేవలం తన నియోజకవర్గం బాగుంటే చాలనే భావనతో ఉన్నారు. పైగా ఇతర విషయాల్లో వేలు పెట్టడానికి ఆయన జంకుతున్నారు. దీంతో మంత్రులు ఉన్నా.. తమకు ఏమి వరిగింది? అనే ప్రశ్న ఆయా సామాజకి వర్గాల నుంచి భారీగా వినిపిస్తుండడం గమనార్హం. మరి దీనికి ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి.