ఆ రికార్డు పవన్​, మహేశ్​కు మాత్రమే సొంతం.. ఏంటంటే?

-

సూపర్​స్టార్​ మహేశ్​బాబు, పవర్​స్టార్​ పవన్​కల్యాణ్​ ఓ అరుదైన ఘనత సాధించారు. ఈ ఇద్దరు స్టార్స్​ ఏ హీరోకి సాధ్యం కానీ రీతిలో ఓ రికార్డును అందుకున్నారు. ఏంటంటే..

ఈ ఏడాదిలో ఇప్పటివరకు విడుదలై, అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాలను పరిశీలిస్తే.. మహేశ్‌ నటించిన ‘సర్కారు వారి పాట’ తెలుగులోనే విడుదలై దేశవ్యాప్తంగా 155కోట్ల వసూళ్లను సాధించగా.. ఇక పవన్‌ కల్యాణ్‌ ‘భీమ్లా నాయక్‌’ సైతం 132 కోట్ల వసూళ్లను సాధించి.. దేశంలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల జాబితాలో టాప్​-10లో నిలిచాయి. ఈ జాబితాలో ఈ రెండు సినిమాలు మాత్రమే ఏకభాషలో విడుదలై 100కోట్లకు పైగా వసూళ్లను సాధించాయి.

అత్యధిక కలెక్షన్లు సాధించిన ప్రాంతీయ భాషా చిత్రాలుగా పాన్‌ ఇండియా చిత్రాల సరసన నిలబడ్డాయి. మిగతా చిత్రాలన్నీ పాన్‌ఇండియా రిలీజ్‌, పాన్‌ ఇండియా సినిమాలుగానే ఆ మార్కును అందుకోవటం గమనార్హం. అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల జాబితాలో ‘సర్కారు వారి పాట’ ఎనిమిదో స్థానంలో నిలిస్తే, ‘భీమ్లా నాయక్‌’ పదో స్థానం సాధించింది. కేవలం ఒక భాషలోనే సినిమా విడుదలై 100కోట్ల వసూళ్లు సాధించే స్టామినా ఉన్నా హీరోలుగా మహేశ్‌బాబు, పవన్‌ కల్యాణ్‌ నిలిచారు. ఈ రికార్డుతో టాలీవుడ్​ మరో మెట్టు ఎక్కిందనే చెప్పాలి.

కాగా, ఇప్పటివరకూ పవన్​, మహేశ్​.. ఇద్దరూ పాన్‌ ఇండియా సినిమా చేయకపోవడం విశేషం. వీరి గత చిత్రాలు సైతం సునాయసంగా వందకోట్ల మార్కును అందుకున్నాయి. ప్రస్తుతం మహేశ్‌ బాబు-త్రివికమ్‌ కాంబినేషన్లో ‘మహేశ్‌బాబు 28’ ఆగస్టులో పట్టాలెక్కడానికి సిద్ధంగా ఉండగా, పవన్‌ కల్యాణ్-క్రిష్‌ కాంబినేషన్లో రూపుదిద్దుకుంటున్న ‘హరిహర వీరమల్లు’ తదుపరి షూటింగ్‌ షెడ్యూల్‌ త్వరలో ప్రారంభం కానుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version