అవును! నిజమే! కృష్ణాజిల్లాలోని కీలకమైన నియోజకవర్గం పెనమలూరులో `మా ఎమ్మెల్యేగారి అడ్రస్ చెప్పరూ!` అంటూ ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఇక్కడ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మాజీ మంత్రి కొలుసు పార్థసారథిపై ఇప్పటికే ప్రజలు ఆగ్రహంతో ఉన్నారు.గత ఏడాది ఎన్నికల అనంతరం.. ఈ ఏడాదిన్న కాలంలో ఆయన ప్రజల మధ్యకు వచ్చింది లేదంటే ఆశ్చర్యంగా అనిపించినా.. ఇది నిజం అంటున్నారు ఇక్కడివారు. నియోజకవర్గంలో సమస్యలు లేవా? అంటే ఉన్నాయి. గత ఏడాది ఎన్నికలకు ముందు ఆయన అనేక హామీలు ఇచ్చారు విజయవాడ టు బందర్ రోడ్డు నిర్మాణంలో భాగంగా.. భూములు కోల్పోయిన వారు పరిహారం కోసం ఇంకా ఎదురు చూస్తున్నారు. వారికి తాను న్యాయం చేస్తానని ఎన్నికలకు ముందు హామీ ఇచ్చారు.
అయితే.. ఇప్పటి వరకు కూడా పార్థసారథి పట్టించుకోలేదు. అంతేకాదు.. ఇక్కడి రైతులకు కూడా ఆయన గతంలో జరిగిన సేకరణకు సంబంధించిన నిధులు ఇప్పిస్తానని హామీ ఇచ్చారు. కానీ, నియోజకవర్గంలో ఆయన ఎవరినీ పట్టించుకోవడం లేదు. పైగా ఎవరికీ అందుబాటులోనూ ఉండడంలేదు. అసెంబ్లీ జరిగినప్పుడు విజయవాడలో లేదంటే.. హైదరాబాద్, కాదంటే తిరుపతి అనేలావ్యవహరిస్తున్నారని కొలుసు అనుచరులే చెబుతున్నారు. దీంతో నియోజకవర్గంలో ప్రజల సమస్యలు పట్టించుకునే నాధుడు కనిపించడం లేదని అంటున్నారు.
ఇక, వైసీపీ పరిస్తితి ఇలా ఉంటే.. మరోవైపు.. టీడీపీ నేతలు కూడా ఎవరికి వారే అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. ఎవరూ కూడా ప్రజల మధ్యకు రావడం లేదు. బోడే ప్రసాద్.. ఉన్నప్పటికీ.. ఏదైనా ముఖ్య కార్యక్రమం ఉంటే.. తనను ఆహ్వానిస్తే.. వస్తున్నారు లేదంటే.. మౌనంగా ఉంటున్నారు. గతంలో కాల్ మనీ కేసులకు ఆయన భయపడుతు న్నారని అంటున్నారు. దీంతో ఇక్కడి ప్రజలు ఎమ్మెల్యేపైనే ఆశలు పెట్టుకున్నారు. తాజాగా కొందరు తమకు పేదలకు ఇళ్ల పథకం కింద ఇళ్లు ఇప్పించాలని అడిగేందుకు వెళ్లగా.. ఎమ్మెల్యే సార్ లేరు… అని జవాబు వచ్చింది.
దీంతో ఎక్కడున్నారో.. చెప్పాలని ప్రజలు ప్రశ్నిస్తే.. సోది అడగండి! అని.. కార్యాలయ సిబ్బంది చెప్పడంతో చిర్రెత్తుకొచ్చిన కొందరు ఎమ్మెల్యే కార్యాలయం ముందు.. బ్యానర్ కట్టి.. మా ఎమ్మెల్యే అడ్రస్ చెప్పిన వారికి బహుమానం అని రాశారు. ఈ వ్యవహారం వైసీపీలో హాట్ టాపిక్ అయింది. స్థానిక మీడియాలోనూ వచ్చింది. అయినా.. ఎమ్మెల్యే మాత్రం ఇప్పటి వరకు స్పందించకపోవడం గమనార్హం.